రెండో రోజు ఉదయం నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. కీవ్ నగరంలో ఏటు చూసినా రష్యా మిలిటరీ ట్యాంకులు, పరిగెత్తుతున్న ఉక్రెయిన్ ప్రజల హాహాకారాలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు, సైరెన్ ల మోతలతో ప్రజలు రైల్వే స్టేషన్ లు, సబ్ వే లు, బంకర్ లలోకి పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియని పిల్లలు తల్లి దండ్రుల వెంట పరుగులు తీస్తున్న హృదయ విదారక దృశ్యాలు కీవ్ లో గోచరిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా రాజధాని తమ అధీనంలోకి వచ్చిందని రష్యా ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం దేశాధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీని సైనిక బంకర్లకు తరలించారు. అమెరికా, నాటో దేశాలు రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ ఆవేదనగా చెప్పారు. రష్యా దాడులను సమర్థంగా తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు. రష్యా దురాక్రమణను ఒంటరిగానే ఎదుర్కుంటామని జెలెన్ స్కీ ప్రకటించారు. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది.
మరోవైపు తమ మీద ఆంక్షలు విధించిన దేశాలపై.. రష్యా సీరియస్ గా ఉంది. అమెరికా, యూరోప్ దేశాలు సహా.. మరిన్ని దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను అమెరికాపైనో.. యూరోప్ పైనో కూల్చేస్తే తట్టుకోగలరా.. అంటూ ఆ దేశానికి చెందిన అధికారి ట్వీట్లు చేయడం.. సంచలనంగా మారింది.