Friday, November 22, 2024
HomeTrending Newsతాలిబాన్ల కోసం రష్యా మంత్రాంగం  

తాలిబాన్ల కోసం రష్యా మంత్రాంగం  

ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లను ప్రపంచ దేశాలతో కలిపేందుకు రష్యా తన వంతు కృషి చేస్తోంది. బుధవారం మాస్కో లో రష్యా నిర్వహించిన మాస్కో ఫార్మాట్ డైలాగ్ సమావేశంలో పాకిస్తాన్, చైనా, ఇరాన్, అఘనిస్తాన్ తో పాటు ఇండియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సుమారు పది దేశాల నుంచి ప్రతినిధులు హాజారు కాగా ఈ సమావేశానికి అమెరికా డుమ్మా కొట్టింది. ఆఫ్ఘన్ వ్యవహారంలో అమెరికా వైఖరి గర్హనీయమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాలకు కూడా అమెరికా రాకపోవటం దురదృష్టకరమని లావ్రోవ్ అన్నారు.

తాలిబన్లను ఏకాకులను చేయటం వల్ల దుష్పరిణామాలు తప్పితే ప్రపంచానికి మేలు జరగదని రష్యా అభిప్రాయపడింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోందని అందుకు ప్రపంచ దేశాలు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని రష్యా పిలుపు ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల అమెరికా ఈ దఫా హాజారు కాకపోయినా మరోసారి జరిగే సమావేశానికి రావాలని రష్యా కోరింది.

మాస్కో ఫార్మాట్ డైలాగ్ పేరుతో 2017 నుంచి రష్యా సమావేశాలు నిర్వహిస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి, సుస్థిరత నెలకొల్పటమే లక్ష్యంగా రష్యా ఈ కార్యక్రమం చేపట్టింది.ఇందులో చైనా ఉన్నందున అమెరికా వ్యతిరేకత వ్యక్తం చేయటంలో ఆశ్చర్యం లేదు. అయితే  తాలిబాన్ల వ్యవహారంలో ఇండియా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్ లో ఉగ్రవాదం కట్టడి చేసేందుకు, తాలిబన్లతో సంప్రదింపులు కొనసాగించేందుకు ఇండియాకు ఉన్న ఒకే ఒక్క మిత్రదేశం రష్యా. రష్యా సహకారం ఉంటేనే భారత్ లోని చైనా, పాక్ సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించవచ్చు.

ఇండియా అమెరికా మాయలో పడితే తాలిబన్లతో భేదాభిప్రాయాలు ముదురుతాయి. దాని దుష్ఫలితాలు ఉగ్రవాదం రూపంలో భారత్ కు ఇబ్బంది కలిగిస్తాయనటంలో అనుమానంలేదు. తాలిబన్లను అమెరికా ఈ రోజు విమర్శిస్తుంది, మరుసటి రోజు స్నేహం చేస్తుంది. స్వప్రయోజనాలు తప్పితే ఇతరుల గురించి అమెరికాకు పట్టదు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్