ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ల నిర్వాకంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. పశ్చిమ దేశాల సహకారంతో ఆఫ్ఘన్లో అమెరికా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించిందో కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జామిర్ కబులోవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వం మీద ఆంక్షలు ఎత్తివేయాలని సూటిగా అడగలేక భద్రతా మండలి ద్వారా ఒత్తిడి తీసుకోస్తున్నారనే ఆరోపణలని కబులోవ్ ఖండించారు. ఆంక్షలు ఎత్తివేయటం అనేది అంతర్జాతీయ సమాజం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్లో అమెరికా, పశ్చిమ దేశాలు సాగించిన మారణహోమంపై భద్రతామండలిలో చర్చ జరగాల్సిందేనని రష్యా స్పష్టం చేసింది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వంపై ఆంక్షలు ఎత్తివేయాలని గత కొద్ది రోజులుగా రష్యా, చైనా, పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికల మీద తాలిబాన్ ప్రభుత్వం తన వాదన చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని రష్యా, పాకిస్తాన్ లు ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. తాలిబాన్ల వ్యవహారంలో అమెరికానే అడ్డుపుల్లలు వేస్తోందనే భావనతో రష్యా కొత్త సమస్యను తెరమీదకు తీసుకొస్తోందనే వాదన ఉంది. పొరుగు దేశంగా ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, సుస్థిరత నెలకొనటం తమ దేశానికి ప్రాధాన్యత అంశమని రష్యా వివరణ ఇచ్చింది.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లను కోరింది. విద్యాహక్కులు, మైనారిటీల హక్కులు కాపాడాలని యుఎన్ తాలిబన్లకు సూచించింది. మానవహక్కులు కాపాడటంలో తాలిబన్లు విఫలం అయ్యారని యుఎన్ ఆరోపించింది.