రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్రెయిన్ వెనక ఉంది పశ్చిమ దేశాలు ఆడుతున్న యుద్ద క్రీడతో పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తుంటే ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం రష్యాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా రష్యా ఆధీనంలోని క్రిమియా ద్వీపకల్పంపై సామూహిక డ్రోన్ల దాడి జరిగినట్లు రష్యా మిలిటరీ పేర్కొన్నది. దాడిని దీటుగా ఎదుర్కొన్నట్లు రక్షణ శాఖ తెలిపింది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను కూల్చివేశామని, కొన్నింటిని ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వీర్యం చేసినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన 17 యూఏవీలను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసిందని, మరో 11 యూఏవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వీర్యం చేశామని రష్యా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ దాడి వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని క్రిమియా గవర్నర్ సెర్గీ అక్సియోనోవ్ తెలిపారు.
రెండు రోజుల క్రితమే క్రిమియా బ్రిడ్జ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. బ్రిడ్జ్‌ను కూల్చేందుకు డ్రోన్లను ఉక్రెయిన్ వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. ఆ దాడి వల్ల బ్రిడ్జ్ రోడ్డుపై ఓ భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం సెవస్తిపోల్ సిటీపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు భావిస్తున్నారు. 8 ఏరియల్, రెండు నావల్ సెమీ సబ్‌మెర్సిబుల్ డ్రోన్లతో ఉక్రెయిన్ అటాక్ చేసిందని రష్యా తెలిపింది.