Sabka Saath Sabka Vikas Sabka Vishwas :
దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్య పరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.
గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం పెరగడంలో కృషిచేయడంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావడంలోనూ చొరవతీసుకోవాలని సూచించారు.
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రజాజీవితంలో విస్తృతమైన అనుభవం ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. పథకాల అమలు సమర్థవంతంగా జరగడంలో తమ అనుభవాన్ని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ‘మీరంతా మార్పునకు సూత్రధారులుగా పనిచేయాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండే బాధ్యతలను స్వీకరించడంతోపాటుగా.. అనుభవం ఉన్న రాజనీతిజ్ఞులుగా కూడా తమ బాధ్యతను నిర్వహించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి సూచించారు.
వాతావరణ మార్పులపై ఆందోళన వెల్లువెత్తుతున్న సమయంలో.. మొక్కల పెంపకం, జల సంరక్షణ, చెత్త నిర్వహణ వంటి పర్యావరణానుకూల చర్యలు చేపట్టే దిశగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా, వారి ఉత్పత్తుల విలువను పెంచే చర్యలను కూడా ప్రోత్సహించాలని వారికి ఉపరాష్ట్రపతి సూచించారు.
100 కోట్ల కరోనా టీకా ప్రజలకు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృందస్ఫూర్తితో పనిచేశాయని అభినందించిన ఉపరాష్ట్రపతి.. టీకాపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు ప్రజలందరూ టీకా తీసుకునే విషయంలో చైతన్య పరచడంలోనూ చొరవతీసుకోవాలన్నారు. వైద్య వసతులు అందడంలో, ప్రజల జీవనశైలిని మార్చుకోవడంలోనూ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు బాధ్యతగా తీసుకోవాలన్నారు.
Also Read : ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం