Wednesday, January 29, 2025
HomeTrending NewsSabarimala: శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

Sabarimala: శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

హరిహర సుతుడు అయ్యప్పస్వామి కొలువైన శబరిమలకు వెళ్లే భక్తులకోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రధానమంత్రి అంగీకరించారు. ఇందుకుగానూ ప్రధానమంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. యావత్ అయ్యప్పభక్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో సహకరించినందుకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రతి ఏటా కోటిమందికి పైగా అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శిస్తారు. మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో స్వాములు డిసెంబర్, జనవరి నెలల్లో ‘మండల దీక్ష’ సందర్భంగా శబరిమలకు వెళ్తారు. ఈ సందర్భంగా భక్తులకు విమాన సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ప్రధానమంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై ప్రధాని సూత్రప్రాయంగా అంగీకరించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సైట్ క్లియరెన్స్ కు పచ్చజెండా ఊపారు.

నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో 2014కు ముందున్న విమానాశ్రయాలు ఎనిమిదేళ్లలోనే రెట్టింపయ్యాయి (దాదాపు 150 విమానాశ్రయాలు ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్నాయి). ఆధ్యాత్మిక యాత్రాక్షేత్రాల్లో మౌలికవసతుల కల్పన, అనుసంధానతను మెరుగుపరచడం ద్వారా సౌలభ్యంగా మార్చడం ద్వారా భక్తులు, సామాన్య ప్రజానీకానికి సౌలభ్యాన్ని అందించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఇందులో భాగంగానే.. అన్ని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాల్లో మౌలికవసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది.

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పాలసీ ఆమోదం నిబంధనల ప్రకారం విమానాశ్రయం ఏర్పాటుకు 2 రకాల అనుమతులు అవసరం అవుతాయి. ఇందులో మొదటిది సైట్ క్లియరెన్స్ కు పచ్చజెండా కాగా.. రెండోది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అనుమతులు. దరఖాస్తులో పేర్కొన్న అంశాల ప్రకారం.. ఈ విమానాశ్రయం అభివృద్ధికి 2263.18 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు వెల్లడైంది. టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) నివేదిక ప్రకారం.. పీపీపీ మోడల్ లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు రూ.3,973 కోట్లు కావొచ్చని అంచనా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్