తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున హీరోల సరసన కథానాయికగా మెప్పిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలను సైతం చేస్తూ వెళుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల స్థాయికి సాయిపల్లవి చాలా తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది. సాయిపల్లవి పాత్రలను ఎంచుకునే తీరు .. ఆ పాత్రల్లో ఒదిగిపోయే విధానం ఆమె అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళుతోంది. తాజాగా తమిళంలో ఆమె చేసిన ‘గార్గి’ ఈ నెల 15వ తేదీన తెలుగులోను విడుదల కానుంది.

‘గార్గి’ సినిమా పోస్టర్స్ నుంచే అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి ఒక బరువైన పాత్రను పోషించిందనే విషయం ఈ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ‘గార్గి’ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. స్కూల్ టీచర్ గా ఆమె పనిచేస్తూ ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలని ఆమె అనుకుంటూ ఉండగా, ఆమె తండ్రి  అరెస్టు అవుతాడు. అందుకు గల కారణాలను ఆమె అన్వేషించే పనిలో పడుతుంది. తండ్రిని కాపాడటం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా.

గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో సూర్య సమర్పిస్తుంటే .. తెలుగులో రానా సమర్పిస్తున్నాడు. సాయిపల్లవి ఒప్పుకునే కథల్లో విషయం ఉంటుందనే నమ్మకంతోనే వాళ్లు ముందుకు రావడం విశేషం. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమాకి సహజత్వమే  ప్రధానమైన బలం. వాస్తవికతకు దగ్గరగా అనిపించే కథాకథనాలు .. సాయిపల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ చుట్టూ అల్లిన ఈ కథ మరో సంచలనాన్ని సృష్టిస్తుందేమో .. సాయిపల్లవి కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *