Sajjala: ఆ ముగ్గురుదీ శబ్ద కాలుష్యం: సజ్జల

పవన్ ఎందుకంత ఆవేశపడుతున్నారో, పూనకంతో వూగిపోతున్నారో అర్ధం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయనే చెప్పినట్లు జగన్ తో వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని, అయినా కారుకూతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుపులు, కేకలు, తిట్లతో ఏం మాట్లాడతారని…. రిషికొండ  బద్దలై జగన్ దానిలో జగన్ పోవాలని మాట్లాడడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.  పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఫ్యాన్స్ ఈలలు, కేకలు వేస్తుంటే ఇంకా రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఒక పధ్ధతి ప్రకారమే తండ్రి, కొడుకు, దత్త పుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వీరు చేస్తున్న శబ్ద కాలుష్యం భరించలేని స్థాయికి వచ్చిందన్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓ వైపు ప్రభుత్వం తాము చేసిన మంచి చెబుతూ ప్రజల ఆశీస్సులు అడగడం సహజమని, ప్రతిపక్ష పార్టీ గతంలో చేసినవి చెప్పుకొని, మళ్ళీ వస్తే ఏం చేస్తామో  చెబుతారని అన్నారు. కానీ మనరాష్ట్రంలో విపక్షాలు కేవలం సిఎం జగన్ పై తిట్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతోనే రాజకీయాలు చేస్తున్నారన్నారు.  తమకు ఏ చట్టాలూ, రాజ్యాంగం, శాసనాలూ అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని, తద్వారా ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని గొడవ చేయడానికే చంద్రబాబు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.  అంగళ్లు, పుంగనూరు లో ఆయనే స్వయంగా రెచ్చగొట్టి తనపై హత్యాయత్నం చేశారంటూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ పోలీసులు సంయమనం పాటించి ఉండకపోతే ఘోరాలు జరిగి ఉండేవాన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే…. చంద్రబాబును అల్లుడిగా చేసుకున్నందుకు తాను మోస పోవడమే కాకుండా రాష్ట్రానికి మోసం చేశానని బాధపడి ఉండేవారని అభిప్రాయపడ్డారు.  ప్రాజెక్టుల యాత్రకు బయల్దేరిన బాబు ఆర్భాటంగా బహిరంగ సభలు పెట్టి ఎవరు రాళ్ళు వేస్తారా అని ఎదురు చూసినట్లు ఉందన్నారు. చంద్రబాబులో ఓ రకమైన పిచ్చి కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటం మాత్రమే ఉందని సజ్జల విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *