Sunday, January 19, 2025
HomeTrending Newsఇది మీడియా టెర్రరిజం కాదా: సజ్జల

ఇది మీడియా టెర్రరిజం కాదా: సజ్జల

రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా రావడాన్ని ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ఒకవైపు పెట్టుబడులు రావని వారే అంటారని, వస్తుంటే అవి అస్మదీయులకే ఇస్తున్నారని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు… ఓపెన్ టూ అల్ విధానంతో టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చని, పాత విధానాన్నే అమలు చేస్తున్నామని చెప్పారు. రెండ్రోజుల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టులు కూడా ఈ కోవలోనే వచ్చినవని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదన్న లక్ష్యంతోనే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని, బరితెగించి ఇలాంటి రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అదానీ, గ్రీన్ కో, అరబిందో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అన్నీ సిఎం బందువుల కంపెనీలే అని రాయడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రాజెక్టులకు గత ప్రభుత్వం ఓ పద్దతి లేకుండా అనుమతులు ఇచ్చిందని, ఓ పారదర్శక విధానం అమలు చేయలేదని, కానీ తాము ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, రైతులకు లాభం చేకూర్చేలా ఈ గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని చెప్పారు.

ఒక్కో ఎకరాన్ని గతంలో రెండున్నర లక్షలకు ఇస్తే ఇప్పుడు దాన్ని ఐదులక్షల రూపాయలకు పెంచామని… కొత్తగా గ్రీన్ ఎనర్జీ సెస్ కూడా విధిస్తున్నామని,  దీని ద్వారా మొదటి 25 ఏళ్ళకు ఒక్కో మెగా వాట్ కు లక్ష రూపాయలు, ఆ తర్వాత రెండు లక్షలు వసూలూ చేస్తున్నామని తెలిపారు. రైతులు భూములు ఇస్తే ఎకరాకు 30 వేలు చొప్పున వారికిఆదాయం వచ్చేలా చూస్తున్నామని చెప్పారు. ఇది పెట్టుబడిదారులకు ఎలా మేలు చేస్తుందో చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టులు జెన్కోకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారని, కానీ గతంలో బాబు సోలార్ ప్రాజెక్టులు ఎందుకు జెన్కోకు ఇవ్వలేదని సజ్జల ప్రశ్నించారు.

2 లక్షల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తే  దాదాపు 4 వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ఆదాయం రాష్ట్రానికి వస్తుందని, 58వేల మందికి ఉపాధి లభిస్తుందని.. వీటికి సపోర్టింగ్ గా ఏడువేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు పెడితే దాని ద్వారా 3,600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, మరో ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇలా  ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా తాము అనుమతులిస్తే అడ్డగోలుగా రాతలు రాస్తున్నారని, దీన్ని ‘మీడియా టెర్రరిజం’అని ఎందుకు అనలేమని నిలదీశారు. పెన్షన్లు పెంచుతూ తాము నిర్ణయం తీసుకుంటే దానిపై ఎలాంటి రాతలు రాయకుండా పంప్ద్ ప్రాజెక్టులపై విషం చిమ్మడం దారుణమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్