Tuesday, June 9, 2026
HomeTrending Newsబూతుల కోసం దీక్షలా?: సజ్జల ధ్వజం

బూతుల కోసం దీక్షలా?: సజ్జల ధ్వజం

బూతులు మాట్లాడే హక్కుకోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్ లోనే పట్టాభి ఆ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబువి చిల్లర రాజకీయాలని మండిపడ్డారు. గుంటూరులో జరుగుతున్న రెండోరోజు జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు. రాజకీయాల్లో కనీస సంస్కారం ఉండాలా వద్దా అనేదానిపై టిడిపి ఆలోచించుకోవాలన్నారు. నలభై ఏళ్ళపాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికీ హుందాగా ఉండడం తెలియదా అని నిలదీశారు.

రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు అని, రాజకీయాలను అయన మరింత దిగజార్చారని విమర్శించారు. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారో బాబుకు తెలియదా అని సజ్జల ప్రశ్నించారు. అధికారం కోసం బాబు తెగ ఆత్రుత పడిపోతున్నారని ఆరోపించారు. యాభై ఏళ్ళు కూడా లేని వ్యక్తి జగన్ బాధ్యతగా వ్యవహరిస్తుంటే 70 ఏళ్ళు ఉన్న చంద్రబాబు బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా అయన దీక్షలు మానుకొని ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నాననే  మాట చెబితే గౌరవంగా ఉంటుందని సూచించారు. బాబుకు పాప విముక్తి కావాలంటే క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే బాబులాంటి నికృష్టుడు, చరిత్ర హీనుడు మరొకరు లేరనే విషయం మరోసారి అర్ధం చేసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీలో వివేకం ఉన్నవాళ్ళు ఉంటే బాబుకు కాస్త ఇంగితం నేర్పించాలని, సరైన పద్దతిగా ఉండాలంటూ చెప్పాలని హితవు చెప్పారు.

ఒక పదాన్ని పట్టాభి పదే పదే ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడారని, సిఎం ను తిడితే వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కోపం రాదా అని నిలదీశారు. బాధ్యాతాయుతమైన రాజకీయాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని, తమ పార్టీ నేతలు కూడా ఎలాంటి పరుష పదజాలం ఉపయోగించినా తప్పేనని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular