Sunday, January 19, 2025
HomeTrending Newsఅమిత్ షా ఆరోపణలు సరికాదు: సజ్జల

అమిత్ షా ఆరోపణలు సరికాదు: సజ్జల

రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ధర్మవరంలో జరిగిన సభలో జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై సజ్జల స్పందించారు. ఏపీలో అవినీతి, ల్యాండ్ మాఫియా ఉందంటూ ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమం అందించి అండగా ఉన్నామని వివరించారు. ఈ విషయంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తాము అమలు చేసిన ప్రతి దానికీ లెక్కలు ఉన్నాయని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎం గా వాడుకున్నారంటూ గతంలో ప్రధాని మోడీ స్వయంగా చెప్పిన విషయాన్ని సజ్జల ప్రస్తావించారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కానీ తాము జాప్యం చేశామంటూ అమిత్ షా చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. కాంట్రాక్టర్లను మార్చి స్పిల్ వే పూర్తి చేయకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మించి, అది వర్షాలకు కొట్టుకు పోవడానికి బాబు అనాలోచిత విధానాలే కారణమని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7వ తేదీన  12,900 కోట్లు పోలవరం ప్రాజెక్టు ఆర్ ఆర్ కు ఇవ్వడానికి  కేంద్ర కేబినెట్ లో నిర్ణయం జరిగిందని… ఇంతలో పొత్తు కుదిరి ఆ నిధుల విడుదల కూడా నిలిచిపోయిందని సజ్జల వెల్లడించారు.  కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్రం వ్యయం చేస్తోదని, కేంద్రం నుంచి రూ, 2,500 కోట్లు రీ ఇంబర్స్ కావాల్సి ఉందన్నారు. పోలవరంపై జగన్ కు మాత్రమే చిత్తశుద్ధి ఉందని తెలిపారు.

తెలుగు భాష విషయంలో కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు సజ్జల. ఓ సర్వే నిర్వహించి 94 శాతం ప్రజలు కావాలని కోరిన తర్వాతే ఆ విద్యా బోధన మొదలు పెట్టామన్నారు. ప్రపంచంలో జరుగుతున్న చెడు మొత్తం ఇక్కడే జరుగుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్