Salim Khan : ఉత్తరప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి సమాజవాది పార్టీలో చేరారు. అమ్రోహా లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సలీం ఖాన్ పార్టీలో సమన్వయం లేదని ఆరోపిస్తూ చేయిచ్చారు. సోమవారం (ఫిబ్రవరి 14)న పోలింగ్ ఉండగా సలీం ఖాన్ పార్టీ మారటం కాంగ్రెస్ కు శరాఘాతంగా మారింది. ఇప్పటికే పార్టీ వీడుతున్న నేతలతో కాంగ్రెస్ యుపిలో డీలాపడింది. మూలిగే నక్క మీద తాటి పండు చందంగా సలీం ఖాన్ వ్యవహారం మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోరని, పార్టీ అగ్రనేతలతో వారిని కలవనీయకుండా రాష్ట్రస్థాయి నేతలు వ్యవహరిస్తారని సలీం ఖాన్ ఆరోపించారు. రాహుల్, ప్రియంకలతో పార్టీ స్థితిగతుల మీద వివరించాలనుకున్నా కలిసే అవకాశం లేదని, అందుకే పార్టీ మారుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ ఐదో దశ ఎన్నికల కోసం స్టార్ కంపైనర్ ల జాబితా కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కు స్థానం కల్పించలేదు. ఇన్నాళ్ళు పంజాబ్ సిఎం అభ్యర్థి అనుకుంటే సిద్దు కు అది దక్కలేదు, ఇప్పుడు ప్రచారానికి కూడా పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. పైగా యుపి ఐదో దశ ఎన్నికల ప్రచారానికి పంజాబ్ సిఎం చరణ్ జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. పంజాబ్ లో ఈ నెల 20వ తేదికి ఎన్నికలు ముగుస్తుండగా యుపిలో ఐదో దశ పోలింగ్ ఈ నెల 27 వ తేదిన ఉన్నాయి.
Also Read : ఉత్తరప్రదేశ్ లో ఆప్ – ఎస్పి ల పొత్తు