Samajwadi Party Chief And Former Up Chief Minister Akhilesh Yadav Made A Key Statement :
సమాజవాది పార్టీ అధినేత UP మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. 2022 ప్రథమార్థంలో జరిగే విధానసభ ఎన్నికల్లో తాను బరిలోకి దిగటం లేదని ఈ రోజు లక్నోలో వెల్లడించారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీతో ఇప్పటికే పొట్టు ఖరారైందని మరికొన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని అఖిలేష్ చెప్పారు. సీట్ల పంపకం మీద ఇంకా నిర్ణయం జరగలేదని, పొత్తులు పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన చిన్నాన శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాది పార్టీ తో పొత్తుకు సిద్దమని అఖిలేష్ స్పష్టం చేశారు. శివపాల్ యాదవ్ పార్టీకి, నాయకులకు ఎన్నికల పొత్తుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని, వారి గౌరవానికి భంగం కలగదని పేర్కొన్నారు.
మరోవైపు మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రసంగంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ భగ్గుమన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ది కోసం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహాత్మాగాంధి, వల్లభాయి పటేల్, మహమ్మద్ అలీ జిన్నా సమకాలికులని చెప్పి వారందరూ ఒక స్థాయి వారని చెప్పేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో వోటు రాజకీయాలు చేసే నేతలు ఇప్పుడు మహానుభావులను కించపరిచి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ తాలిబాన్ మనస్తత్వం కలిగి ఉన్నారని యోగి ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యుపిలో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు బిజెపి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రోజుకో ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సమాజ్ వాది క్యాడర్ లో నూతనోత్సాహం నింపుతున్నారు. అటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధి ఉచిత పథకాలతో ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలు అంటున్నారు. లఖింపూర్ ఖేరి ఘటనలో దోషులను శిక్షించాలని ప్రియాంక గాంధి డిమాండ్ చేస్తున్నారు.
Must Read :ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు సన్నాహాలు