Thursday, April 18, 2024
Homeసినిమామీడియాపై సమంత కోపం

మీడియాపై సమంత కోపం

నిజమే.

తిరుమల గుడి దగ్గర సెలెబ్రిటీలను ఏది అడగాలో? ఏది అడగకూడదో?  మీడియాకు తెలిసి ఉండాల్సిందే. సినీ నటి అక్కినేని నాగ సమంత గుడి ముందు మీడియాపై ఆకాశమంత ఆగ్రహించినట్లు ఒక వార్త. ఆమె దాంపత్య జీవితం మీద వినిపిస్తున్న పుకార్లను ఎవరో మీడియా ప్రతినిధి అడగ్గానే ఆమె కోపం ఇసుమంత కాకుండా సముద్రమంత పొంగడం అర్థం చేసుకోవచ్చు.

మీడియాకు ఎలాంటి బుద్ధి ఉండాలో సమంతకు అంత క్లారిటీ ఉన్నట్లుంది. మంచిదే.

అయితే- తిరుమల గుళ్లో తెల్లవారకముందే వి ఐ పి బ్రేక్ దర్శనం చేసుకుని బయటికొచ్చే అతిరథ మహారథులని తమకు తాము అనుకునేవారి విజువల్స్, బైట్లు తీసుకోవడం తిరుమల గుడి బీట్ రిపోర్టర్ ధర్మం. విధి. సాధారణంగా బయట ఒక బైట్ కు దొరకని సెలెబ్రిటీలు తిరుమలలో దొరుకుతారు. ఇది అక్కడి రిపోర్టర్లకు ఒక అవకాశం. అదే వారికి తల నొప్పి. తిరుపతిలో, తిరుమలలో రిపోర్టర్ అంటే అదొక కంచి గరుడ సేవ. తాము పని చేసే మీడియా యాజమాన్యాలకు అత్యుత్తమ దర్శనాలు అరేంజ్ చేయడమే అక్కడి రిపోర్టర్ల ప్రథమ కర్తవ్యమై ఉంటుంది. ఆయా మీడియా కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్ కి కూడా దర్శనాలు అరేంజ్ చేసి పెట్టాల్సిన బాధ్యత ఎలాగూ ఉండనే ఉంటుంది. ఇందులో ఎవరికెంత పుణ్యం దక్కుతుందో కానీ…తిరుమల తిరుపతి దేవస్థానాల రిపోర్టింగ్ మాత్రం నల్లేరు మీద బండి నడక కాదు. చాలా కాలం పాటు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేసిన నాకు ఇంకా చాలా వివరాలు తెలుసు. సభా మర్యాద దృష్ట్యా రాయలేను. అక్కడి రిపోర్టర్ల మీద నా సానుభూతి మాత్రం ఈనాటికీ అలాగే ఉంది.

సంస్కృతంలో దర్శనం అంటే చూడడం అని అర్థం. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో దర్శనం అంటే చాలా లోతయిన అర్థముంది. దేవుడిని చూడ్డానికి మనం వెళ్లడాన్ని దర్శనం అనుకుంటున్నాం. కానీ…మనం వెళ్లినప్పుడు దేవుడి కంట్లో మనం పడడమే నిజమయిన “దర్శనం” అవుతుంది. అంటే దేవుడే దయదలిచి మనల్ను దర్శించాలి. అలా ఎప్పటికో ఒకప్పటికి దేవుడు మనల్ను చల్లగా చూడకపోతాడా అని పదే పదే దేవుడి కంట్లో పడడానికి ప్రయత్నిస్తూ చాలా మంది పెద్దవారు ప్రత్యేక విమానాలు వేసుకుని రోజూ సూర్యుడి కంటే ముందే తిరుమలలో వెలుగుతూ ఉంటారు. నిజానికి సూర్యుడు విష్ణువుకు ఒక కన్ను. తిరుమలకు రాకపోయినా భక్తిగా కొలిచే ఎవరినో ఆయన చూస్తూనే ఉంటాడు. సర్వాంతర్యామికి, అంతర్యామికి అదెంత పని?

అక్కినేని నాగ సమంతమ్మ భక్తి కలిగి పొద్దున్నే వెంకన్నను దర్శించుకోవడం మంచిదే. అక్కినేని వారి భక్తి ప్రపత్తులు ఇక్కడ అనవసరం. ఆమె అక్కినేని నాగ సమంతగా ఉందా? అక్కినేని నాగ రహిత సమంతా రుతు ప్రభగా ఉందా? అన్నది కనుక్కునే మీడియా అధికారాన్ని మాత్రం కాదనే హక్కు ఆమెకు ఉండదు. నిజమే. అడిగిన చోటు, సందర్భం తప్పు కావచ్చు. కానీ…సరయిన చోటు, సరయిన సందర్భం అని ఆమె అనుకున్న చోటులో అయినా చెబితే బాగుంటుంది. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పడం, చెప్పకపోవడం సెలెబ్రిటీల హక్కు. దాన్నెవరూ కాదనరు. అయితే మీడియా ప్రశ్నించకూడదు అని అనుకునే హక్కు మాత్రం ఉండదు.

చైతన్య రహితంగా సమంత ఒంటరిగా స్వామి వారిని దర్శించుకున్న సందర్భంలో వారి ఆదర్శ దాంపత్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. వైవాహిక వ్యక్తిగత జీవితాలు వారిష్టం. మీడియా కూడా కొన్ని చోట్ల నియంత్రణ పాటించాలి.

ఆ ప్రశ్నకు-

“అలాంటిది ఏదన్నా ఉంటే ముందు మీకే చెప్తానుగా!”

అని నవ్వుతూ సమంత ముందుకెళ్లి ఉంటే ఇంత చర్చే ఉండేది కాదు.

పాపం…ఆమె సమస్యలేమిటో! మనకెలా తెలుస్తాయి?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్