12 years of career: ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నప్పటికీ కథానాయికల యొక్క కెరియర్ కి సంబంధించిన కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కారణం వారి కెరియర్ వారి గ్లామర్ తో ముడిపడి ఉండటమే. అందువల్లనే ఆ గ్లామర్ ఉండగానే వాళ్లు వివిధ భాషల్లో సాధ్యమైనన్ని సినిమాలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకప్పటి హీరోయిన్లు దశాబ్దాల పాటు తిరుగులేని కెరియర్ ను కొనసాగించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పట్టుమని ఒక పది సినిమాలు చేస్తే ఫరవాలేదే అనుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆమె, ఆ తరువాత నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అదే సమయంలో తమిళంలోను ఆమె తన పట్టును పెంచుతూ వచ్చింది. నయనతార .. అనుష్క .. త్రిష .. కాజల్ .. తమన్నా వంటి కథానాయికల పోటీని తట్టుకుని నిలబడింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి క్రేజ్ తెచ్చుకుంది. కెరియర్ ఆరంభంలో హీరోతో కలిసి ఆడిపాడే పాత్రలను .. ఆకతాయి పాత్రలను చేస్తూ వచ్చిన సమంత, ఆ తరువాత నటనలో పరిణితిని సాధిస్తూ వెళ్లింది. ‘రంగస్థలం’ .. ‘మజిలీ’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.
ఇక ఎంతటి బరువైన కథనైనా .. పాత్రనైనా సమంత తన భుజాలపై మోయగలదని నిరూపించింది. నాయిక ప్రధానమైన పాత్రలను ఆసక్తికరంగా అత్యంత సమర్థవంతంగా నడిపించదలదని చాటి చెప్పింది. అందుకు నిదర్శనంగా ‘యూ టర్న్’ .. ‘ఓ బేబీ’ సినిమాలు కనిపిస్తాయి. ‘శాకుంతలం’ .. ‘యశోద‘ కూడా ఆ జాబితాలో చేరడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ‘శాకుంతలం’ ఆమె కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిచే అవకాశాలు పుషకాలంగా కనిపిస్తున్నాయి.
ఇలా సమంత కెరియర్ పరంగా ఈ రోజుతో 12 సంవత్సరాలను పూర్తి చేసింది. లైట్స్ .. కెమెరా .. యాక్షన్ అనే మాటలను వింటూ ఇక్కడివరకూ వచ్చానని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ జర్నీ తనకి ఎంతో సంతోషంగా .. సంతృప్తి కరంగా ఉందని చెప్పింది. ఇంతకాలంగా తనని అభిమానిస్తూ వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. 12 ఏళ్ళ కాలానికి తెలుగులో ఎంతో ప్రాముఖ్యం ఉంది. 12 ఏళ్ళ కాలాన్ని పుష్కరం అని పిలుస్తారు. సమంత సినీ కెరీర్ కూడా పుష్కరం పూర్తి చేసుకుంది.
ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఓ కుటుంబం నుంచి వచ్చి సమంత ఈ స్థాయికి చేరుకోవడం .. ఒకే సమయంలో రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం నిజంగా విశేషమే! అలాంటి ఆమె ప్రతిభను అభినందించకుండా ఉండటం కష్టమే!!
ఇవి కూడా చదవండి: అదే.. నా ఫిలాసపీ – శివాజీరాజా