ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కసితో ఏకంగా యుద్ధానికే తెర తీసిన రష్యా వైఖరిని యావత్తు ప్రపంచం విమర్శిస్తోంది. అయితే ఉత్తర యూరోప్ లోని బెలారస్ రష్యాకు మద్దతు పలకటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలకు వేదికను సిద్ధం చేసిన చిన్న దేశం బెలారస్ రష్యా వైఖరికి మద్దతు పలకడంతో పాటుగా ఏకంగా రష్యాతో కలిసి యుద్ధ రంగంలోకి దిగేందుకు కూడా సిద్ధమైపోయింది. రష్యాకు ప్రత్యక్ష మద్దతు తెలిపిన ఫలితంగా ఆ దేశంపై ఆంక్షలకు తెరలేచింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆంక్షల్లో భాగంగా బెలారస్‌పై ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్‌లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను యుద్దోన్మాదంగా అభివర్ణించింది. బెలారస్ నుంచి అథ్లెట్లు, అధికారులు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నుంచి నిషేధించాలంటూ పిలుపు ఇచ్చింది.