Friday, March 29, 2024
HomeTrending Newsహైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం

హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం

ఫార్మా మరియు గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్ ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది.

ఈరోజు శాండోస్ (Sandoz) కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్- Richard Saynor ప్రతినిధి బృందం మంత్రి కే తారకరామారావుతో ప్రగతిభవన్లో సమావేశమై ఈ మేరకు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ కేంద్రంగా సాండోస్ కంపెనీ తన గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, శాండోస్ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాదులో కలిగి ఉందని, ఇదే స్థాయిలో సాండోస్ కంపెనీ కూడా హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ పలు వివరాలు అందజేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మసిటీ గురించి వివరాలు అందజేసిన కేటీఆర్, సాండోస్ లాంటి కంపెనీకి ఫార్మాసిటీ అద్భుతమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగరంలో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రతినిధి బృందం, హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికే తమ సంస్థ వెయ్యికి పైగా మాలిక్యుల్స్ ని కలిగి ఉన్నదని, దాదాపు పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జిస్తున్నదని, హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది. తమ కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కే తారకరామారావు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్