శరత్ బాబు .. అనగానే ఆయన అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. ఆకర్షణీయమైన నవ్వు గుర్తొస్తుంది .. చక్కని మాట తీరు మనసును ఆకట్టుకుంటుంది. మంచి మేనిఛాయ .. హైటూ .. అందుకు తగిన రూపం శరత్ బాబు సొంతం. అంతటి అందగాడు సినిమాల్లో ట్రై చేయడంలో ఆశ్చర్యం లేదు. 1973లోనే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాను కదా అని శరత్ బాబు హీరో వేషాల కోసం తిరగలేదు .. ఆ తరువాత కూడా హీరో వేషాల దిశగా వెళ్లడానికి ఆసక్తిని చూపలేదు.

నిజ జీవితంలో శరత్ బాబు డీసెంట్ .. హుందాతనాన్ని కాపాడుకోవడంలో ఆయన ఎక్కువ దృష్టి పెట్టేవారు. తన బాడీ లాంగ్వేజ్ కి తగని పాత్రల జోలికి ఆయన వెళ్లేవారు కాదు. నిజానికి తనకి డాన్సులు చేయడం ఇష్టం ఉండదని శోభన్ బాబు చెబుతుండేవారు. కానీ శరత్ బాబు డాన్సులు చేయడం ఇష్టం లేకనే హీరోల పాత్రల వైపు వెళ్లలేదు. ఇక అప్పుడప్పుడు డాన్సులు చేయవలసి వచ్చినా తన డిగ్నిటీ దెబ్బతినకుండా చూసుకునేవారు. ఇక తన స్వభావానికి తగనివనే ఆయన విలన్ పాత్రల వైపు కూడా వెళ్లలేదు.

ఎంతోమంది సీనియర్ దర్శకులతో కలిసి పనిచేసిన శరత్ బాబు, ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల ఆదరణ పొందడానికి మాత్రమే ఆసక్తిని కనబరిచారు. హీరోలకు తగిన కేరక్టర్ ఆర్టిస్ట్ అవసరమైనప్పుడు అందరికీ ఉన్న ఏకైక ఆప్షన్ గా శరత్ బాబు కనిపించేవారు. తెరపై ఆయనతో పాటు కనిపించవలసి వచ్చినప్పుడు కొంతమంది హీరోలు కూడా తేలిపోయేవారు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు .. తమిళ భాషల్లో వందల సినిమాలు చేసిన ఆయన, అడపా దడపా మాత్రమే కన్నడ .. మలయాళ సినిమాల్లో కనిపించారు.

ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా శరత్ బాబుపై ఎలాంటి విమర్శలు లేవు. ఎలాంటి వివాదాల జోలికి ఆయన వెళ్లలేదు. అన్ని ఇండస్ట్రీలలోను ఆయన అజాత శత్రువు. సినిమాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ, పాతికేళ్ల క్రితమే టీవీ సీరియల్ లోను నటించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. శరత్ బాబు వాయిస్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. తెలుగును స్పష్టంగా మాట్లాడే అతి తక్కువమంది ఆర్టిస్టులలో ఆయన ఒకరు. ఇకపై అలాంటి హ్యాండ్సమ్ కేరక్టర్ ఆర్టిస్టును చూడవేమో ..  అలాంటి వాయిస్ ను వినలేమేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *