మొదటి నుంచి కూడా సత్యదేవ్ తనకి వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన నుంచి ఇంతవరకూ కొని సినిమాలు వచ్చినా, హీరోగా చేయాలా? విలన్ రోల్స్ చేయాలా? అనే ఒక విషయంలో తేల్చుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తూ వచ్చింది. వీలైతే విలన్ .. లేదంటే హీరో అనే తరహాలో, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో తనలోని నెగెటివ్ షేడ్స్ ను కూడా సత్యదేవ్ చూపించాడు. ఆ సినిమాలో ఆయన చేసిన రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే ‘గుర్తుందా శీతాకాలం‘. మొన్న శుక్రవారం రోజునే ఈ సినిమా థియేటర్ లకు వచ్చింది. సత్యదేవ్ మీసాలు తీసేసి కథలో కాలేజ్ కుర్రాడిగా కనిపించడానికి చాలా కష్టాలు పడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయిందనే విషయం తెలుస్తూనే ఉంది. నిజానికి ఇది సత్యదేవ్ కి నప్పని కథ .. ఆయన ఎంతమాత్రం ఇమడలేని కథ. ఆయన ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండునే అనుకుంటూనే ప్రేక్షకులు బయటికి వస్తారు.
సత్యదేవ్ బాడీ లాంగ్వేజ్ కి కొన్ని పాత్రలు బాగుంటాయి. అలాంటి పాత్రలలోనే ఆయనను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా కాకుండా ఒక లవర్ గా తెరపై కనిపించాలని ఆయన అనుకుంటే కాస్త ఇబ్బందే. టీనేజ్ లవ్ స్టోరీస్ ను మాత్రమే రిసీవ్ చేసుకుంటున్న ట్రెండ్ ఇది. ముదురు ప్రేమకథలను వినాలని .. చూడాలని ఆడియన్స్ అనుకోవడం లేదనే విషయంలో ఇంతకుముందు కొన్ని సినిమాలు నిరూపించాయి. అందువలన అడివి శేష్ తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఎలా అయితే ఒక జోనర్ ను సెట్ చేసుకుని ముందుకు వెళుతున్నాడో, అలాగే సత్యదేవ్ కూడా తనదైన ఒక జోనర్ ను ఏర్పాటు చేసుకోవడమే మంచిదనే మాట బలంగానే వినిపిస్తోంది మరి.