తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిక ఇక లంఛనమే… గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. షాతో పటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టిడిపి, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మూడు పార్టీల పొత్తులో… మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 145, 25 ఎంపి సీట్లలో 18 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయాలని… మిగిలిన 30 అసెంబ్లీ, 7 పార్లమెంట్ సీట్లు జనసేన, బిజెపిలకు కలిపి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది.
అసెంబ్లీ సీట్ల విషయంలో తమకు పెద్దగా పట్టింపు లేదని, పార్లమెంట్ సీట్లు ఎక్కువ కావాలని బిజెపి పట్టుబడుతోంది. 7 నుంచి 9 ఎంపి సీట్లు…. 10 అసెంబ్లీ స్థానాలు కావాలని అమిత్ షా ప్రతిపాదించారు.
అయితే ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించిన టిడిపి… బిజెపి డిమాండ్ పై దృష్టి సారించింది. 6 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లకు ప్రాథమికంగా చంద్రబాబు అంగీకారం తెలియజేశారని తెలిసింది, జనసేనకు కేటాయించిన మూడులో ఒకటి తగ్గించి, జనసేనకు 2, బిజెపికి 5 ఇస్తామని బాబు చెప్పారని సమాచారం. అవరమైతే మరో ఎంపి సీటు అదనంగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం,తిరుపతి, రాజంపేట పార్లమెంట్ స్థానాలు బిజెపి, జనసేనపార్టీలకు ఇచ్చే అవకాశాలున్నాయి.
జమ్మలమడుగు, హిందూపురం, కైకలూరు, విశాఖ నార్త్, తాడేపల్లి గూడెం, ధర్మవరం సీట్లలో బిజెపి పోటీ చేయనుంది.