సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను గట్టిగా ఢీకొట్టడంతో బోల్తా పడి సంఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం. నవంబర్ ౩౦న జరిగిన ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నందిత వయస్సు 37 సంవత్సరాలు. ఆమె తండ్రి దివంగత ఎమ్మెల్యే గడ్డం సాయన్న వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసిన నందిత ఓ పర్యాయం కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత ఆమె పరాజయం పాలయ్యారు.
2023 ఫిబ్రవరి19న ఆమె తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో లాస్యనందితకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది. బిజెపి అభ్యర్ధి శ్రీ గణేష్ పై 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా, ఆమె రెండు వారాల క్రితం కూడా ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఫిబ్రవరి 13 న నల్గొండలో జరిగిన బిఆర్ఎస్ బహిరంగసభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టి ఓ హోం గార్డ్ మరణించాడు. ఆమె స్వల్ప గాయాలతో బైటపడ్డారు. మరో సంఘటనలో ఓ లిఫ్ట్ లో ఇరుక్కొని షుమారు రెండు గంటలపాటు చిక్కుకున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఓ యువ నేత అకాలమరణం చెందడం దురదృష్టకరం.