Saturday, April 20, 2024
Homeతెలంగాణసంకల్పంలేని బిజెపి విజయ సంకల్ప యాత్ర

సంకల్పంలేని బిజెపి విజయ సంకల్ప యాత్ర

తెలంగాణలో కమల వికాసం కోసం ఆ పార్టీ జాతీయ నాయకత్వం తరచుగా రాష్ట్ర పర్యటన చేపడుతూ… ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు ఎంపి సీట్లకు అదనంగా మరో నాలుగు గెలుచుకోవాలని బిజెపి ప్రణాలికలు సిద్దం చేసింది. ఇందులోభాగంగా మంగళవారం నుంచి విజయ సంకల్పయాత్ర చేపట్టింది. రాష్ట్రాన్ని అయిదు క్లష్టర్లుగా విభజించి కార్యక్రమాన్ని రూపొందించింది.

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలను, ప్రజలను కలిసేలా రూట్ మ్యాప్ సిద్దం చేశారు. భాగ్యలక్షి క్లస్టర్‌ కింద భువనగిరి నుంచి సికింద్రాబాద్‌, కృష్ణమ్మ క్లస్టర్‌ కింద ముక్తల్‌ నుంచి నల్గొండ, కాకతీయ భద్రకాళి క్లస్టర్‌ కింద భద్రాచలం నుంచి ములుగు, కొమరం భీమ్‌ క్లస్టర్‌ కింద ముధోల్ నుంచి బోధన్‌, రాజరాజేశ్వర క్లస్టర్ కింద తాండూర్ నుంచి కరీంనగర్‌ వరకు ‘విజయ్‌ సంకల్ప యాత్రలు’ ప్లాన్‌ చేశారు. అయిదు క్లష్టర్లలో జాతీయ నాయకులు పాల్గొనేలా.. రాష్ట్ర స్థాయిలో నేతలు కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు.

జాతీయ నేతల హడావిడి కొనసాగుతున్నా.. క్యాడర్ లో ఉత్సాహం రావడం లేదని, నిర్లిప్తంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బిజెపి నేతలు ప్రజా సమస్యలపై పోరాడటం మానుకొని… కేవలం పార్టీ ప్రచార కార్యక్రమాల నిర్వహణలోనే నిమగ్నం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఓట్ల వేటలో ప్రజలను కలిసేందుకు ఉత్సాహం చూపుతున్న కమలనాథులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆసక్తి చూపటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికలకు పార్టీ టికెట్ వస్తే చాలు గెలుపు నల్లేరు మీద నడక అనే ధోరణిలో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విరుద్దంగా ఉన్నాయంటున్నారు. గతంలోని నాలుగు ఎంపి సీట్లకు అదనంగా రావటం దేవుడెరుగు ఉన్న వాటిని నిలుపుకుంటే అదే గొప్ప అని పార్టీ నేతలే అనుకుంటున్నారు.

అగ్రనేతలు వారి నియోజకవర్గాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నేతలు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. హైదరాబాద్ నేతల హడావిడి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ వరకే సరిపోతోంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే నాయకుడు లేకుండా పోయాడు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విజయసంకల్ప యాత్ర సాగుతున్నా కేవలం పార్టీ కార్యక్రమంగా కనిపిస్తోందని విశ్లేషణ జరుగుతోంది. సంకల్పంలేని నేతలతో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోందని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ సభలు కొంత ప్రజలను ఆకట్టుకుంటున్నా.. కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ ప్రకటనలకే పరిమితం అయ్యారనే టాక్ ఉంది. ఈ దఫా సికింద్రాబాద్ వదిలి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని కిషన్ రెడ్డికి సన్నిహితులు సలహా ఇస్తున్నారని వినికిడి.

ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఈటెల రాజేందర్ ఒకటే ప్రకటన చేస్తున్నారు. మల్కాజ్ గిరి టికెట్ ఇస్తే పోటీకి సిద్దమని ప్రకటనలకు పరిమితం అయ్యారు. మా పార్టీలో నాపి కుట్ర జరుగుతోందని అసంతృప్తి వ్యాఖ్యలు అదనం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఎవరితో సంబంధం లేదన్నట్టుగా మల్కాజ్ గిరి నియోజకవర్గం అంతటా పోస్టర్ల ప్రచారం చేపట్టారు. ఆయన ఎక్కడుంటారో తెలియక పార్టీ శ్రేణులు తికమకవుతున్నారట?

బీఆర్ఎస్ – బిజెపిల మధ్య ఎలాంటి అవగాహనా లేదని చాటి చెప్పేందుకు రాష్ట్ర నేతలు ఆపసోపాలు పడుతున్నారు. గులాబీ నేతల మీద ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా మీదనే ఆధారపడిన తెలంగాణ  బిజెపి నేతలు…కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్