Saturday, July 27, 2024
HomeTrending Newsపొత్తులు సవ్యంగా జరిగేనా?

పొత్తులు సవ్యంగా జరిగేనా?

మరో పక్షంరోజుల్లో లోక్ సభ సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మొగనుంది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే మార్పులు చేర్పులతో అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ వెళుతోంది, రేపో మాపో ఈ మార్పులకు సంబంధించి తుది జాబితా విడుదల చేయడంతో పాటు మొత్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లకు పోటీచేసే వారి జాబితాను ఒకసారి విడుదల చేయాలని సిఎం జగన్ యోచిస్తున్నారు. ఈసారి బిసిలు, మహిళలకు వీలైనంత ఎక్కువగా అవకాశం కల్పించబోతున్నారు.

కాగా, తెలుగుదేశం ఇప్పటికి జనసేనతో పొత్తు కుదుర్చుకోగా, బిజెపి కూడా ఈ కూటమిలో చేరబోతుందని వార్తలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చర్చలు జరిపిన తరువాత పొత్తు దాదాపు ఖరారైందని అందరూ అనుకున్నారు. బిజెపి పార్లమెంటరీ  బోర్డు సమావేశమై టిడిపి పొత్తుపై ఓ అధికారిక ప్రకటన చేస్తుందని భావించినా అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులను అనధికారికంగా ప్రకటిస్తూ క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని సూచిస్తోంది. తమను సంప్రదించకుండానే మండపేట, అరకు నియోజకవర్గాలకు అభ్యర్ధులను చంద్రబాబు బహిరంగంగా ప్రకటించడంపై కినుక వహించిన పవన్ కళ్యాణ్ జనవరి 26న రాజోలు, రాజానగరం సీట్లలో తాము పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో కందుల దుర్గేశ్ ను తమ పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు పవన్. దీనిపై బుచ్చయ్య ఆగ్రహంగా ఉన్నారు. భీమిలి, గాజువాక, పెందుర్తి, ఎలమంచిలి స్థానాలకు కూడా ఇన్ ఛార్జ్ లను జనసేనాని ప్రకటించారు. భీమవరంలో తాను స్వయంగా బరిలోకి దిగుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల్లో మూడింట ఒకవంతు తమకు ఇస్తారని, కాబట్టి అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ చేసిన వ్యాఖ్యలు జనసైనికులకు మిగుడుపడడంలేదు.

విజయవాడ పశ్చిమ సీటు కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టిడిపి నుంచి పోటీలో ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాలని… నగర పార్టీ అధ్యక్షుడు పోతిన మహేష్ పోటీలో ఉంటారని ఆ పార్టీ చెబుతోంది. పెద్దాపురంలో మాజీ డిప్యూటీ సిఎం చినరాజప్పకు బాగాలేదని, అందుకే ఈసారి ఆయన స్థానంలో వేరొకరికి అవకాశం ఇస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనను విశాఖ నార్త్ నుంచి చీపురుపల్లికి వెళ్ళమని నాయకత్వం చెప్పిందని… కానీ దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని గంటా శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, టిడిపి గెజిట్ గా ప్రచారంలో ఉన్న ఓ దినపత్రిక జిల్లాల వారీగా ఆ పార్టీ సీట్లు, అభ్యర్ధుల పేర్లను ప్రచురిస్తోంది. దీనిపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేసున్నారు.

ఈ రెండు పార్టీల మధ్యే పరిస్థితి ఇలా ఉంటే బిజెపి కూడా ఈ కలిస్తే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బిజెపి కూడా ఈసారి భారీ స్థాయిలో సీట్లు అడుగుతోందని సమాచారం. లోక్ సభను ఒక యూనిట్ గా తీసుకొని దానిపరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో 4 టిడిపి, 2 బిజెపి, 1 జనసేన చొప్పున పోటీ చేయాలన్న ప్రతిపాదన బిజెపి అగ్ర నాయకత్వం చంద్రబాబు ముందు పెట్టిందని, దీనిపై ఆయన ఎటూ తేల్చుకోలేక… బిజెపితో పొత్తును నిర్ద్వంద్వంగా కాదనుకోలేక మదనపడుతున్నారట.

కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వమే అధికారం రానుందని ఇప్పటికే అన్ని సర్వేలూ ఏకపక్షంగా చెబుతున్న దశలో ఆ పార్టీతో కలిస్తే ఎన్నికల సమయంలో అనేక అంశాల్లో ‘సహకారం’ ఉంటుందని ఆలోచిస్తున్న బాబు ఈ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఓ వైపు జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతుంటే, ఈసారి కూడా బాబు తన సహజసిద్ధమైన నాన్చుడు ధోరణితోనే వ్యవహరిస్తున్నారని, ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని జేసి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పొత్తులు, సీట్లు, స్థానాల విషయమై అతి త్వరలో తుది నిర్ణయం తీసుకోకపోతే మొత్తంగా కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్