Sunday, January 19, 2025
HomeTrending NewsParliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. జై భీమ్ నినాదాలు

Parliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. జై భీమ్ నినాదాలు

పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. లోక్‌సభలోకి టియర్ గ్యాస్ ను వదిలారు. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి టియర్ గ్యాస్ వదలడంతో పార్లమెంటు సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ అగంతకుల్ని, బయట మరో యువతి, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పొగ ధాటికి పార్లమెంటు సభ్యులు భయంతో పరుగులు తీశారు. ప్యానల్ స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. జీరో అవర్ లో మాల్దా ఎంపి కగెన్ ముర్ము మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పసుపు రంగు కలర్ టియర్ గ్యాస్ షెల్స్ సభలో విసిరారు. మైసూర్ ఎంపి ప్రతాప సింహ పేరుతో వీరికి సందర్శకుల పాసులు జారీ అయ్యాయి.

ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీకి వచ్చారని వారు సభలోకి దూకారని ప్రత్యసాక్షులు వెల్లడించారు. దుండగులు చాలాసేపు సభ కార్యకలాపాలు గమనిస్తున్నారని హటాత్తుగా దూకటంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని, సభలో పసుపు రంగు పొగ వచ్చిందని..భయభ్రాంతులకు గురయ్యామని సందర్శకులు వివరించారు.

ఆగంతకులు తీరు చూస్తే వారు సంచలనం చేసేందుకే ప్రయత్నించినట్టు కనిపించింది. వారు ఎవరిని టార్గెట్ చేసినట్టుగా ప్రయత్నించలేదని తెలుస్తోంది. బెంచీలపై నుంచి దూకి పరుగులు తీశారు. షూలో టియర్ గ్యాస్ పెట్టుకొని వారు వచ్చారు. తానా షాహి నహి చలేగా…జై బీమ్…భారత్ మాతాకి జై అంటూ యువతీ మరాటీ భాషలో నినాదాలు చేసింది. నియంతృత్వం చెల్లదని నినదించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

తాము ఏ సంస్థకు చెందినవారం కాదని…నిరుద్యోగ యువత అని.. మా సమస్యలు చెప్పేందుకు ఏ అవకాశం లేకనే ఈ తీరుగ వ్యవహరించాల్సి వచ్చిందని యువతి వివరించింది. ప్రశ్నించే వారిని భారత ప్రభుత్వం హిసిస్తోందని ఆమె ఆరోపించింది. ఆగంతకుల్లో యువతీ హర్యానాలోని హిస్సార్ కు చెందిన నీలం కౌర్, సాగర్, మనోరంజన్ లు బెంగలూరుకు చెందిన వారని, అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ చెందిన వారని ప్రాథమిక సమాచారం ఉంది.   గ్యాస్ తో ఎలాంటి ప్రమాదం లేదని… పోలీసులు విచారణ చేస్తున్నారని లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

నేటికి పార్లమెంటుపై దాడి జరిగి ఇరవై రెండు ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం కాకతాళీయమా? కావాలనే చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఖలిస్థాని వేర్పాటువాది గురుపత్వంట్ సింగ్ పన్నున్ ఇదివరకే హెచ్చరిక చేశారు. డిసెంబర్ 13 రోజు మళ్ళీ దాడి చేసి తీరుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ రోజు అలజడి సృష్టించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్