ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. సీనియర్ పోలీసు అధికారి, గురుకులాల ప్రత్యేక కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్- వీఆర్‌ఎస్) కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ప్రవీణ్ కుమార్ ఈ మెయిల్ చేశారు. మరో ఆరేళ్ళు సర్వీసు ఉండగానే పదవీ విరమణ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండున్నర దశాబ్దాల నుంచి వివిధ హోదాల్లో ప్రవీణ్ కుమార్ సేవలందించారు.
1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్ కోరడం హాట్ టాపిక్‌గా మారింది.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను ప్రవీణ్ కుమార్ బహిర్గతం చేశారు. 26 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో పని చేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.