మూడో ముచ్చటకు శరద్ పవార్ తెరతీశారు. 2024 టార్గెట్ గా విపక్షాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వార్ బిగిన్ అంటూ ప్రధాని మోదీ లక్ష్యంగా పవార్ పవర్ చూపడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అని పశ్చిమ బెంగాల్ లో తనకు తిరుగులేదని విజయఢంకా మోగించిన దీదీ అండతో మరోమారు పవార్ సాహసమే చేస్తున్నారు. మూడో కూటమి విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఎన్సీపీ అధినేత ప్రస్తుతం చేస్తున్నది సాహసమే. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండు పర్యాయాలు చర్చల అనంతరం శరద్ పవార్ అడుగు ముందుకేశారు.
మూడో కూటమి ఏర్పాటు దిశగా ముచ్చట్లు జరపటానికి ఈ మరాఠా యోధుడు తన ఢిల్లీ నివాసంలో 15 పార్టీల ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసి, చర్చలకు తెరలేపారు. ఇందులో మేధావులకు స్థానం కల్పించారు. వీరంతా మిషన్ 2024 పేరిట ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జతకట్టాలని భావిస్తున్నవారే. అయితే కాంగ్రెస్ ను కూడా దూరంగా జరిపి మూడో ప్రత్యామ్నాయానికి ప్రయత్నాల దిశగా ప్రస్తుతం ఎన్సీపీ అధినేత ,ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ బీజేపీ దిగ్గజం యశ్వంత్ సిన్హా తో కలిసి అడుగు ముందుకేశారు. తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ విజయం స్ఫూర్తితో రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త రాజకీయ సమీకరణాలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు.
యశ్వంత్ సిన్హా వ్యవస్థాపకుడిగా ఉన్న రాష్ట్రమంచ్ ద్వారా వివిధ పార్టీల నేతలకు ఆహ్వానం అందగా, నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, ఆప్ కు చెందిన సునీల్ గుప్తా, ఆరెల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఎస్పీ నుంచి జ్ఞాన్ శ్యామ్ తివారి , సీపీఐ, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు .
వీరితోపాటు జస్టిస్ ఏ పీ షా,జావెద్ అక్తర్, కేసీ సింగ్ వంటి ప్రముఖులు పవార్ విందులో పాల్గొన్నారు. ఎనిమిది పార్టీల ప్రముఖులయితే హాజరయ్యారు కానీ ఈ భేటీలో ఎలాంటి చర్చలు జరిగాయి అన్నదానిపై స్పష్టత కరువైంది.
దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, మోదీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చసాగిందని చెబుతూనే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు కావంటూ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. ఏదైనా ఇదంతా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా పడుతున్న అడుగులు అన్నది మాత్రం అందరూ కాదనలేని నిజం. బీజేపీ తో పాటు కాంగ్రెస్ ను దూరంగా పెట్టి మిగిలిన విపక్షాలన్నీ ఏకం కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా, తొలిదశ చర్చల తర్వాత కాంగ్రెస్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారా, అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదంతా బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలే.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే మరాఠా యోధుడు పవార్, టీఎంసీ కి చెందిన యశ్వంత్ సిన్హా తో కలిసి ఈ కీలక భేటీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా, ఈ సమావేశానికి పీకే కూడా దూరంగా ఉన్నారు. ఒకవైపు పవార్ ఇంట్లో సమావేశం పై చర్చోపచర్చలు సాగుతుండగానే ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ వంటివి 2024లో బీజేపీ కి ప్రత్యామ్నాయం కాబోవని కుండ బద్దలు కొట్టారు. పీకే మాటల వెనుక పరమార్థం ఏమిటో ఆయనకే తెలియాలి గాని, కరోనా విపత్తు తదితర పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోదీ హవా తగ్గిందన్న భావన మాత్రం విపక్షాలకు ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్ ,గుజరాత్ ,పంజాబ్ లతో తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే ఏడాదిలో జరుగనున్న ఎన్నికలు బీజేపీతో పాటు విపక్షాలకు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి నిలుస్తోంది. కీలకమైన యూపీలో బీజేపీని ఓడించగలిగితేనే 2024 దిశగా విపక్షాలు ఐక్యంగా అడుగులు వేయగలుగుతాయి.
అయితే అందరూ అనుకున్నట్లుగా విపక్షాల ఐక్యత అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంతకుముందు ఎన్నో ఉదాహరణలు ప్రతిపక్షాల అనైక్యతను చాటి చెబుతున్నాయి. విపక్షాల లో ఎవరికి వారు ఐక్యత కోసం ప్రయత్నించడం తనదే ఆధిపత్యం అంటూ భావించడంతో మూడో ముచ్చట వ్యవహారం ప్రతిసారీ అపహాస్యం అవుతోంది. ఈసారి ప్రశాంత్ కిషోర్ వ్యూహం మేరకే పవార్ కూటమి దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలతోనే ఈ భేటీ కి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మూడో కూటమి ఏర్పాటు కోసం ఈ సమావేశం జరగలేదని శరద్ పవార్ సెలవిచ్చినా ఈ సమావేశం వెనుక ఏదో వ్యూహం ఉందని మాత్రం భావించాలి.
ఈ సమయంలోనే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ రంగంలో దిగుతున్నారని, ఆ దిశగానే విపక్షాలన్నింటినీ ,పవార్ ఏకతాటిపైకి తెచ్చి తన వైపునకు తిప్పుకుంటున్నారన్న ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. అటు కాంగ్రెస్ తోనూ మైత్రి నడుపుతున్న శరద్ పవార్ అందరి నుంచి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తో ఒక ఉన్నతమైన పదవిని దక్కించుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మరాఠా యోధుడు, బీజేపీకి చెక్ పెట్టేందుకు మూడో ముచ్చట దిశగా పావులు కదుపుతున్నారా…. లేక రాష్ట్రపతి పదవి కోసం అందరిని ప్రసన్నం చేసు కుంటున్నారా అన్నది మాత్రం భవిష్యత్తులోనే తేలాల్సి వుంది. పీకే వ్యూహానికి పవార్ ఎలా పదును పెడుతున్నారన్నదీ వేచిచూడాలి.
-వెలది.కృష్ణకుమార్