Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించిన అజేయ వీరుడు

శూన్యం నుండి సామ్రాజ్యాన్ని నిర్మించిన అజేయ వీరుడు

భారతదేశ చరిత్రలో ‘ఛత్రపతి’ అన్న మాటకు సార్థకతనిచ్చిన మహావీరుడు శివాజీ మహారాజ్. ఒక సామాన్య బాలుడు ‘సార్వభౌముడు’గా మారిన తీరు, మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించిన వైనం నేటికీ అద్భుతం. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఆయన జీవితంలోని ప్రధానమైన ఘట్టాలివి:-

1.జననం- స్వరాజ్య ప్రతిజ్ఞ

శివాజీ 1630 ఫిబ్రవరి 19న పుణే సమీపంలోని శివనేరి కోటలో శివాజీ జన్మించాడు. తండ్రి షాజీ రాజే భోంస్లే, తల్లి జిజియాబాయి. చిన్నతనం నుంచే తల్లి చెప్పిన రామాయణ, భారత గాథలు ఆయనలో ధర్మ రక్షణ కాంక్షను రగిలించాయి.

కేవలం 15 ఏళ్ల వయసులో (1645), రాయరేశ్వర ఆలయంలో తన రక్తాన్ని శివలింగానికి అర్పించి ‘హిందూ స్వరాజ్యం’ కోసం ప్రతిజ్ఞ చేశాడు. ఆ వెంటనే 16 ఏళ్లకే తోరణ కోటను ఆక్రమించి తన విజయ యాత్రను ప్రారంభించాడు.

2. అఫ్జల్ ఖాన్ వధ (1659) అతికాయుడిపై వ్యూహాత్మక విజయం

శివాజీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన బీజాపూర్ సుల్తాన్, తన సేనాపతి అఫ్జల్ ఖాన్ను పంపాడు. 1659 నవంబర్ 10న ప్రతాప్‌గఢ్ కోటలో విందు పేరుతో శివాజీని హతమార్చాలని ఖాన్ ప్లాన్ వేశాడు.
ఖాన్ భారీకాయుడు, శివాజీ ఆయన ముందు వామనుడిలా ఉంటాడు. కౌగిలించుకుంటూనే ఖాన్ కత్తితో పొడవగా, లోపల ‘ఉక్కు కవచం’ ధరించిన శివాజీకి ఏమీ కాలేదు. వెంటనే తన చేతిలో దాచుకున్న ‘పులి గోరు’ (Bagh Nakh) తో ఖాన్ పొట్ట చీల్చి చెండాడాడు. ఈ విజయం శివాజీని ఒక జాతీయ వీరుడిగా నిలబెట్టింది.

3. పావన్‌ఖిండ్ యుద్ధం (1660) అజేయమైన త్యాగం

అఫ్జల్ ఖాన్ మరణం తర్వాత, సిద్ధీ జౌహర్ పన్హాలా కోటను ముట్టడించాడు. అక్కడ నుండి తప్పించుకునే క్రమంలో బాజీ ప్రభు దేశ్‌పాండే చూపిన వీరత్వం అమోఘం.

కేవలం 300 మంది మరాఠా వీరులు 10 వేల మంది శత్రు సైన్యాన్ని ‘ఘోడ్ ఖిండ్’ దగ్గర అడ్డుకున్నారు. శివాజీ సురక్షితంగా విశాల్‌గడ్ చేరుకున్నారని తెలిపే ఫిరంగుల శబ్దం వినిపించే వరకు, ఒళ్లంతా గాయాలైనా బాజీ ప్రభు పోరాడి ప్రాణాలు వదిలాడు. అందుకే ఆ ప్రాంతం ‘పావన్‌ఖిండ్’ (పవిత్రమైన లోయ) అయ్యింది.

4. లాల్ మహల్ దాడి (1663) షైస్తా ఖాన్ పరాభవం

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన మేనమామ షైస్తా ఖాన్ను లక్ష మంది సైన్యంతో పంపగా, అతను పూణేలోని లాల్ మహల్‌ను ఆక్రమించాడు. శివాజీ 1663 ఏప్రిల్ 5న కేవలం 400 మందితో పెళ్లి ఊరేగింపులా మారువేషంలో వెళ్లి, అర్థరాత్రి సర్జికల్ స్ట్రైక్ చేశాడు. ప్రాణభయంతో కిటికీలోంచి దూకుతున్న షైస్తా ఖాన్ వేళ్లు శివాజీ కత్తి దెబ్బకు తెగిపోయాయి.

5. ఆగ్రా నుండి సాహసోపేతమైన తప్పించుకోవటం (1666)

చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఇది. ఔరంగజేబు శివాజీని ఆగ్రాలో గృహనిర్బంధం చేశాడు. కానీ శివాజీ అనారోగ్యం నెపంతో ప్రతిరోజూ పేదలకు మిఠాయి బుట్టలు పంపడం మొదలుపెట్టాడు. ఒకరోజు అదే బుట్టల్లో తన కుమారుడు శంభాజీతో కలిసి శత్రువుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. 1000 కిలోమీటర్లు మారువేషంలో ప్రయాణించి మళ్ళీ తన సామ్రాజ్యానికి చేరుకుని ఔరంగజేబుకు షాక్ ఇచ్చాడు.

6. పట్టాభిషేకం- నౌకాదళం (1674)

1674 జూన్ 6న రాయగఢ్ కోటలో శివాజీ ‘ఛత్రపతి’గా పట్టాభిషిక్తులయ్యాడు. ఆయన కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదు, ఒక దార్శనిక పాలకుడు. కొంకణ్ తీరాన్ని రక్షించడానికి బలమైన నౌకాదళాన్ని నిర్మించి ‘భారత నౌకాదళ పితామహుడి’గా పేరుగాంచాడు.

తెలుగు సాహిత్యంలో ‘శివభారతము’

శివాజీ వీరగాథలు తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. ప్రముఖ కవి గడియారం వేంకట శేషశాస్త్రి రచించిన ‘శివభారతము’ ఆధునిక తెలుగు పంచకావ్యాల్లో ఒకటి. శివాజీ తన శత్రువుల అంతఃపుర స్త్రీలను గౌరవించి, వారిని తల్లిలా భావించి సాగనంపిన తీరును ఇందులో అద్భుతంగా వర్ణించారు.

1680లో శివాజీ భౌతికంగా దూరమైనా, ఆయన నేర్పిన గెరిల్లా యుద్ధ తంత్రాలు, ధర్మ రక్షణ నేటికీ భారత సైన్యానికి స్ఫూర్తి. “వనరులు తక్కువగా ఉన్నాయని భయపడవద్దు, సంకల్పం గొప్పదైతే ఏదీ అసాధ్యం కాదు”– అన్న శివాజీ సందేశం నిరంతరం ఒక స్ఫూర్తిగా ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular