తెలుగు సినిమా ప్రపంచంలో కళకు అర్థంచెప్పిన పేరు — విశ్వనాథ్.
సినిమా ఆయన చేతుల్లో వినోదం కాదు… కళలు, సంస్కృతి…విలువలతో కూడిన ..జీవన విధానం. ప్రతిసినిమాని తపస్సులా భావించారు. అందుకే కాశీనాథుని విశ్వనాధ్ కళా తపస్వి అయ్యారు.
ఈ రోజు ఆ మహా దర్శకుని 95 వ జయంతి
సౌండ్ రికార్డిస్ట్‌గా ప్రారంభమైన కళా తపస్వి ప్రయాణం…
1965లో వచ్చిన ఆయన తొలి దర్శకత్వ చిత్రం ఆత్మ గౌరవం తో కొత్త దిశ తీసుకుంది. కుటుంబ విలువల గురించి సున్నితంగా చెప్పిన ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
తర్వాత వచ్చిన జీవనజ్యోతి తల్లీ బిడ్డల అనుబంధాన్ని, ఆవేశాన్ని, భావోద్వేగాలను ప్రతిబింబించింది.

1979లో వచ్చి తెలుగు సినిమాల్లో చరిత్ర సృష్టించిన చిత్రం — శంకరాభరణం.
శాస్త్రీయ సంగీతానికి అంకితమైన ఈ సినిమా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుని భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది.
1981లో వచ్చిన సప్తపది సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ జాతీయ అవార్డును అందుకుంది.
1982లో శుభలేఖ సినిమా వరకట్నం వంటి సామాజిక సమస్యపై ధైర్యంగా స్వరం వినిపించింది.
1983లో వచ్చిన సాగరసంగమం ఒక కళాకారుడి అంతర్మథనాన్ని చూపింది. ఇందులో కమలహాసన్ నటన చిరస్మరణీయం.

1986లో వచ్చిన స్వాతిముత్యం భారతదేశం తరఫున ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా నిలిచింది. అమాయకుడైన కథానాయకుడిగా కమల్ హాసన్ నటన విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ ను ప్రపంచానికి చూపించింది.
అదే సంవత్సరంలో వచ్చిన సిరివెన్నెల ఒక అంధకళా కారుడి ప్రస్థానాన్ని అద్భుతమైన సంగీత సాహిత్య సంగమం రూపంలో చూపింది. ఈ చిత్రం పేరు సిరివెన్నెల గీత రచయిత సీతా రామశాస్ట్రీ ఇంటిపేరయింది
1987లో వచ్చిన … స్వయంకృషి పట్టుదలతో ఎదిగే సాధారణ మనిషి గాథ. శ్రమకు గౌరవం ఇచ్చిన చిత్రం.
1990లో వచ్చిన స్వాతి కిరణం గురు–శిష్య సంబంధంలో అసూయ, ప్రతిభ మధ్య జరిగే సంఘర్షణ చూపింది.
శృతిలయలు సంగీత సంప్రదాయాల పరిరక్షణపై దృష్టి పెట్టింది.
శుభసంకల్పం మనసు మారితే జీవితం ఎలా మారుతుందో తెలిపింది.
విశ్వనాథ్ సినిమాల్లో హీరో గర్జించడు — గుండెతో మాట్లాడతాడు.
నాయిక బలహీనురాలు కాదు — ఆత్మగౌరవానికి ప్రతీక.
ప్రేమలో ప్రదర్శన కాదు — పరస్పర గౌరవం.
కళలో ఆర్భాటం కాదు — ఆత్మస్పర్శ

ఆయన చిత్రాలు అనేక నంది అవార్డులు, జాతీయ పురస్కారాలు అందుకున్నాయి. దేశ విదేశాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకున్నాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లతో సత్కరించింది. భారతీయ సినీరంగ అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన అందుకున్నారు .
ప్రతి సినిమానీ తపస్సులా భావించేవారు. అందుకనే కళా తపస్వి అయ్యారు.
కళను కధానాయకుడిగా నిలబెట్టిన మహానుభావుడు, కళా తపస్వి విశ్వనాథ్ తెలుగునాట పుట్టడం మన అదృష్టం.

