ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరపున ఏఈవో హరీంద్రనాథ్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, శివరాత్రి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం, స్వయంభు శ్రీ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు మహాభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహాభిషేకం చేశారు. అనంతరం వారికి వేదా శీర్వచనం అందించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారితోపాటు జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు కూడా ప్రత్యేక పూజలు చేశారు.

మహా శివరాత్రి పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెం శ్రీ మహాదేవ మార్కండేయ స్వామి ఆలయంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలంపూర్ జోగులాంబ బాల బ్రంహేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యెక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ ఛైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, సాయిచంద్ గార్లు ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు.

మహబూబాబాద్‌లోని భద్రకాళీ సమేత కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని మడికొండలో ఉన్న మొట్టగుట్ట క్షేత్రంలో, రుద్రేశ్వర వేయి స్తంభాల ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో శివపార్వతులకు కల్యాణం నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లాలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ఆలయంలో ముక్తీశ్వరస్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ములుగులోని రామప్ప శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులుతీరారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ని మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం LMD కాలనీ లో గల మృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్‌ మండలం దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు ఆలయంలో స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *