Sunday, November 24, 2024
HomeTrending Newsశివసేన గుర్తు షిండే వర్గానికి... ఉద్ధవ్ థాక్రేకి ఈసీ షాక్

శివసేన గుర్తు షిండే వర్గానికి… ఉద్ధవ్ థాక్రేకి ఈసీ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమిది. 56 ఏళ్ల తరువాత పార్టీ స్థాపించిన కుటుంబం పార్టీపై పట్టు కోల్పోయిన అనూహ్య పరిణామం ఇది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శివసేన థాక్రే వర్గాన్ని కాదని..చీలిక వర్గమైన ఏక్‌నాథ్ షిండే వర్గానిదే శివసేన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి కూటమిని వ్యతిరేకిస్తూ 2022 జూన్ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే బయటికి వచ్చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టి..బీజేపీ సహాయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం నడుస్తోంది. అప్పటి నుంచి శివసేన పార్టీ గుర్తింపు కోసం థాక్రే వర్గం వర్సెస్ షిండే వర్గం న్యాయపోరాటానికి దిగాయి. గత 8 నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల కమీషన్ తెరదించింది. శివసేన పార్టీ గుర్తు విల్లు బాణంను షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఇది నిజంగానే మింగుడుపడని పరిణామం.

శివసేన చీలికవర్గం నేత ఏక్‌నాథ్ షిండేదే అసలైన శివసేన అని..ఎన్నికల గుర్తు విల్లు బాణంను ఆ వర్గానికే కేంద్ర ఎన్నికల కమీషన్ కేటాయించడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే..ఎవరైనా సరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం అవుతారని మండిపడ్డారు. షిండే వర్గానికి చెందినవారు ముందుగా బాలాసాహెబ్‌ను అర్ధం చేసుకోవాలని కోరారు. మహారాష్ట్రలో మోదీ పేరు పనిచేయనందున..స్వలాభం కోసం బాలాసాహెబ్ ముసుగులో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా అని విమర్శించారు.

ఏక్‌నాథ్ షిండే వర్గం విల్లు బాణం గుర్తును దొంగిలించిందని..ప్రజలే దీనికి ప్రతీకారం చెబుతారని థాక్రే తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని సుప్రీంకోర్టు కొట్టిపారేస్తుందని..16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తుందని  ఉద్దావ్ థాకరే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేన రెబెల్ గ్రూప్ కన్పించకుండా పోతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్