Saturday, November 23, 2024
HomeTrending NewsManipur: అగ్నిగుండంగా మారిన మణిపూర్

Manipur: అగ్నిగుండంగా మారిన మణిపూర్

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజా ఘర్షణలతో శనివారం తెల్లవారుజామున వరకు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపుగా తరలివచ్చి విధ్వంసానికి యత్నించడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ఆర్మీ, పోలీసు అధికారులు తెలిపారు.

స్థానికంగా ఉన్న అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ వద్ద ఓ అల్లరి మూక నిప్పంటిచడానికి ప్రయత్నించిందని.. ఆ మూకలో దాదాపుగా వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడినట్లు చెప్పారు. మణిపూర్ యూనివర్సిటీ సమీపంలో కూడా కొందరు గుంపుగా ఏర్పడి విధ్వంసానికి యత్నించినట్లు తెలిపారు.

సుమారు 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని ఇరింగ్బామ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేసినట్లు వెల్లడించారు. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో అర్ధరాత్రి వరకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంఫాల్ వెస్ట్ లోని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదా దేవి నివాసం వద్ద ఆందోళన కారులు విధ్వంసానికి యత్నించారు. సైన్యం, పోలీసు యంత్రాంగం వారిని అడ్డుకుంది.

మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నెలలో మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ప్రకటించింది. నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి నెలకుపైగా కొనసాగుతున్న అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్