మాస్ యాక్షన్ జోనర్ సినిమాలపై గోపీచంద్ మలినేని తనదైన ముద్రవేస్తూ వెళుతున్నాడు. ‘క్రాక్’ హిట్ తరువాత ఆయన చేసిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాపై సహజంగానే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ‘ఒంగోలు’ వేదికగా వైభవంగా జరిగింది. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఈ వేదికపై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, చదువుకునే రోజుల నుంచి తాను బాలయ్య అభిమానిననీ .. ‘సమరసింహా రెడ్డి’ సినిమా రిలీజ్ రోజున పెద్ద గొడవ కూడా జరిగిందని చెప్పాడు. ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిందనీ .. బయటికి రాగానే ఆ సినిమా చూడటం జరిగిందని అన్నాడు. అలా ఒకప్పుడు బాలయ్య అభిమానిగా ఆయన సినిమాలు చూడటానికి ఎగబడిన తాను, ఆయనతో సినిమా చేసే స్థాయికి వచ్చినందుకు హ్యాపీగా ఉందని చెప్పాడు. ఇంతకంటే జీవితంలో కావలసిందేముంటుంది? అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక శృతి హాసన్ గురించి ప్రస్తావిస్తూ .. ఆమెతో తాను చేసిన మూడో సినిమా ఇది అనీ, ఆమె తన లక్కీ హీరోయిన్ అని చెప్పాడు. ఆమె కామెడీ టైమింగ్ గొప్పగా ఉంటుందనీ, డాన్స్ కూడా ఇరగదీసేస్తుందని అన్నాడు. ఆమె గురించి తాను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదని అంటూ,  శ్రుతి ఐ లవ్ యు’ అని చెప్పేశాడు. ఆ మాటకి శ్రుతి హాసన్ తో పాటు బాలయ్య కూడా నవ్వేశారు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీలో శ్రుతి హాసన్ మెరవడం ఈ ఫంక్షన్ కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *