Sunday, January 19, 2025
HomeTrending Newsసిద్ధిపేటలోనే తొలి పామాయిల్‌ ఫ్యాక్టరీ

సిద్ధిపేటలోనే తొలి పామాయిల్‌ ఫ్యాక్టరీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్‌ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ రోజు (బుధవారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీ సిద్ధిపేట జిల్లాలో ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయం చేసే రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందమని, రైతులు వరి అని ఒకటే పంట వేస్తున్నరని.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతేరాజు కావాలన్నది కేసీఆర్‌ కల అన్నారు. వరి వేస్తే రూ.25వేల వరకు మిగులుతుందని, అందు కోసమే మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో ఆయిల్‌పామ్‌ జిల్లాగా డిక్లేర్‌ చేయించామన్నారు. ఎకరానికి రూ.80వేల సబ్సిడీ ఇస్తు్న్నట్లు పేర్కొన్నారు. డ్రిప్‌ కంపెనీలకు సబ్సిడీ పెంచామన్నారు. ఖమ్మం జిల్లాకు చాలా మందిని పంపామని, కళ్లతో చూసి వచ్చారన్నారు. కోతులు, పందులు, చీడపీడ లేని పంట.. ధర రాదనే బాధ లేదన్నారు.

ఎకరానికి తక్కువలో తక్కువ రూ.1.50లక్షల వరకు నికరంగా లాభం వస్తుందన్నారు. పంట కొనేది ఆయిల్‌ ఫెడ్‌ ప్రభుత్వ సంస్థ అనీ, ఫ్యాక్టరీ మన జిల్లాలోనే ఉందన్నారు. గవర్నమెంట్‌ ఉద్యోగికి ఎంత జీతం వస్తదో.. ఆయిల్‌ పామ్‌ రైతుకు అంతే వస్తదని చెప్పారు. దేశం లక్షల కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుందని, మన దేశంలో పండకనే ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. నూనె పంటల సాగు దేశంలో తక్కువని, పామాయిల్‌కు మంచి డిమాండ్‌ ఉంటదన్నారు. రైతులు పంటలు వేస్తే బాగుపడుతారని, జూలై కల్లా 20వేల ఎకరాలకు మొక్కలు రెడీగా ఉన్నాయని, ఇప్పటికే 3వేల ఎకరాల్లో పంటవేశారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రం తొండాట..
కేంద్రం ప్రభుత్వం తొండాట ఆడుతుందని, యాసంగి పంట అంటేనే బాయిల్డ్‌ రైస్‌ అన్నారు. రా రైస్‌ పట్టిస్తే నూకలు ఎక్కువ, బియ్యం తక్కువ అనీ, పండేది బాయిల్డ్‌ రైస్‌ ఇస్తమంటే.. రా రైస్‌ కొంటామంటున్నారన్నారు. కొంటమని చెబుతరు.. బాయిల్డ్ రైస్ కొనం అంటున్నరని.. నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించినట్లు కేంద్రం వ్యవహారం ఉందని విమర్శించారు. నూకలు ఎంత ఖర్చయితే అంత రూ.2వేలకోట్లా.. రూ.3వేల కోట్ల నష్టం భరిద్దాం.. రైతును నిలబెడుదాం అని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Also Read : ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్