సిక్కు వేర్పాటువాద గ్రూపులు ఇన్నాళ్ళు కెనడా, ఇంగ్లాండ్ లో మాత్రమె చురుకుగా ఉండేవి. గత కొన్నాళ్ళుగా ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల్లో సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టగా సంచలన అంశాలు వెలుగు చూశాయి. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురుద్వారాలపై కాల్పులు జరుగుతున్న ఘటనల్లో కాలిఫోర్నియా పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏకే47, హ్యాండ్‌గన్స్, మెషిన్ గన్స్‌లను సీజ్ చేశారు. ఇటీవల స్టాక్‌టన్, సాక్రమెంటో పట్టణాల్లో ఉన్న గురుద్వారాల్లో కాల్పులు ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 20 ప్రాంతాల్లో రెయిడ్ నిర్వహించిన తర్వాత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ తెలిపారు.
ఇటీవల సుట్టర్, సాక్రమెంటో, సాన్ జాక్విన్, సొలనో, యోలో, మెర్సెడ్ కౌంటీల్లో పలుమార్లు హింసాత్మక ఘటన, కాల్పులు జరిగాయి. అయితే ప్రత్యర్థి క్రిమినల్ గ్యాంగ్‌లు ఆ దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టాక్‌టన్ లో ఉన్న సిక్కు ఆలయంపై 2022, ఆగస్టు 27న దాడి జరిగింది. సాక్రమెంటోలో ఉన్న సిక్కు ఆలయంపై 2023 మార్చి 23వ తేదీన దాడి జరిగింది. ఆ రెండు దాడుల్లో అరెస్టు అయిన గ్యాంగ్ సభ్యులు ఉన్నట్లు తేలింది.