పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురిలో విషాదం చోటు చేసుకుంది. నవరాత్రుల చివరి రోజు కాళీ మాత నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్తర బెంగాల్ ప్రధాన నగరమైన సిలిగురి నగరానికి అనుకుని మాల్ నది ప్రవహిస్తుంది. ప్రతి ఏడాది నవరాత్రి నిమజ్జనోత్సవాలు మాల్ నదిలో జరగటం పరిపాటి. ఇదే క్రమంలో బుధ వారం నదీ తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు కోలాహలంగా నిమజ్జనం జరిగింది.
సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో పూజలు చేసేందుకు నదిలోకి దిగి భక్తులు పూజలు చేస్తున్నారు. ఇదే సమయంలో మాల్ నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో గందరగోళం నెలకొంది. దుర్గ అమ్మవారు విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన 8 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక ప్రజలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జల్పైగురి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ లో స్పందించిన మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇదిలాఉంటే ఈ ఘటన జరిగిన సమయంలో మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఒక్కసారిగా నదిలో వదర ఉధృతిపెరగడం కారణంగానే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు.
మాల్ నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో నీటి ప్రవాహంలో అనేక మంది కొట్టుకుపోతున్న దృశ్యాలు పలువురు వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.