భారత ఒలింపిక్స్ సంఘానికి చెందిన అథ్లెట్స్ కమిషన్ కు బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుతో సహా మరో పది మంది ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మొత్తం పది మంది కార్యవర్గం ఉండే ఈ కమిషన్ లో జాతీయ స్థాయిలో వివిధ క్రీడాంశాలకు చెందిన 42 మంది ఎలెక్టోరల్ కాలేజ్ సభ్యులుగా ఉంటారు. వీరు తుది పది మంది కమిషన్ కు నామినేట్ అయ్యారు. వీరిలో 32 మంది నేడు తమ నామినేషన్స్ ఉపసంహరించుకావడంతో మిగిలిన పది మంది పోటీలేకుండా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ఉమేష్ సిన్హా ప్రకటించారు.
మేరీ కోమ్, సింధు తో పాటు గగన్ నారంగ్, ఆచంట శరత్ కమల్, భజ్ రంగ్ లాల్, మీరాబాయి చాను, రాణీ రాంపాల్, శివ కేశవన్, భవానీ దేవి, ఓం ప్రకాష్ కర్హానాలు ఎన్నికయ్యారు. వీరిలోనుంచి ఇద్దరిని చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు గా ఎన్నుకుంటారు. దీనితో పాటు వివిధ క్రీడాంశాల్లో లబ్ధప్రతిష్టులైన ఎనిమిది మందిని కూడా స్పోర్ట్స్ పర్సన్స్ అఫ్ ఔట్ స్టాండింగ్ మెరిట్ (ఎస్ఓఎం) కేటగిరి కింద ఎంపిక చేస్తారు. దీనికోసం నవంబర్ 15న మధ్యాహ్నం 4 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.
భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష పదవికి డిసెంబర్ 10 న జరగనున్న ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్ ను ఎస్ఓఎం తో పాటు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు ఎంపిక చేస్తారు