Kidambi in Top-10:
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇటీవల స్పెయిన్ లో ముగిసిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2021 టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్ గా నిలిచి రజత పతకం గెల్చుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ టాప్ టెన్ లో చోటు సంపాదించాడు. గతంలో 14వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ ఈ విజయంతో నాలుగు స్థానాలు పైకి ఎగబాకి 10వ స్థానంలో నిలిచాడు.
ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ లో కాంస్య పతకం పొందిన మన దేశానికే చెందిన లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగు పరచుకొని 17వ ప్లేస్ లో నిలిచాడు. మరో ఆటగాడు సాయి ప్రనీత్ రెండు స్థానాలు కిందకు వెళ్లి18వ స్థానంలో నిలిచాడు, క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన మరో భారత ఆటగాడు హెచ్ ఎస్ ప్రన్నోయ్ ఆరు స్థానాలు పైకి ఎగబాకి 26వ స్థానంలో నిలిచాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ లో వెనుదిరిగిన తెలుగు తేజం పివి సింధు, ఈ ర్యాంకింగ్స్ లో తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది. కొంత కాలంగా గాయాలతో సతమతమవుతోన్న సైనా నెహ్వాల్ 25వ స్థానంలో నిలిచింది.
మహిళల డబుల్స్ లో అశ్విని పోన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ 20వ స్థానంలోను, మహిళల డబుల్స్ లో చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయి రాజ్ జంట ఒక ర్యాంక్ కోల్పోయి ప్రస్తుతం 10వ స్థానంలో నిలిచారు.
Also Read : ఫైనల్లో శ్రీకాంత్, సేన్ కు కాంస్యం