Friday, April 19, 2024
Homeసినిమాతీపియాత్రలు చేయించిన రామకృష్ణుడి గాత్రం

తీపియాత్రలు చేయించిన రామకృష్ణుడి గాత్రం

Singer Ramakrishna Mesmerized The Telugu People With His Voice :

వేల భావాలను ఒక్క మాటలో చెప్పేది పాట .. అనుభూతి అగాధాల లోతును అందంగా తాకేది పాట. పరిమళించడం పాట ప్రథమ లక్షణం .. పరవశింపజేయడం పాట ప్రధాన లక్షణం. మధురమైన పాట గుండె గడపకు మంచి గంధం అద్దుతుంది .. మనసు పాత్రను మకరందపు కలశంలా తీర్చిదిద్దుతుంది. అలాంటి పాటలతో తెలుగు ప్రేక్షకులను .. శ్రోతలను అలరించిన గాయకులలో వి.రామకృష్ణ ఒకరు. రామకృష్ణ పాట వింటే వెన్నెల వలయంలో విహరించి నట్టుగా ఉంటుంది .. వసంతాల  వనంలో ప్రయాణించినట్టుగా ఉంటుంది.

రామకృష్ణ అసలు పేరు ‘విస్సంరాజు రామకృష్ణ దాసు‘. విజయనగరంలో ఆయన జన్మించారు. మొదటి నుంచి కూడా రామకృష్ణకి పాడటం ఇష్టం .. పాట అంటే ప్రాణం. అందువల్లనే ఆయన శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు.  పాటల పట్ల ఆయనకి గల ఆసక్తి కారణంగానే ఆయన అడుగులు సినిమా పరిశ్రమ దిశగా పడ్డాయి. ప్రముఖ గాయని సుశీల ఆయనకి పిన్ని. సినిమాలలో గాయకుడిగా ఆయన ప్రయత్నించడానికి అది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు.

Singer Ramakrishna

తెలుగు పాటను ఘంటసాల శాసిస్తూ .. శ్వాసిస్తూ వచ్చారు. ఆయనను కాదని వేరే గాయకులతో పాటలు పాడించే సాహసం ఎవరూ చేసేవారు కాదు. అది ఆయన స్వరానికి గల మహాత్మ్యం .. గానానికి గల గౌరవం. అయితే అప్పటికే కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలిసారిగా ఆయన స్వరం విని అక్కినేని నాగేశ్వరరావు అవకాశం ఇచ్చారు. అలా ఆయన తొలిసారిగా ‘విచిత్రబంధం’ సినిమా కోసం కేవీ మహదేవన్ సంగీత దర్శకత్వంలో ‘వయసే ఒక పూల తోట’ అనే పాట పాడారు.

రామకృష్ణ పాడిన ఆ పాట ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది .. సూపర్ హిట్ సాంగ్స్ కేటగిరిలో చేరిపోయింది. ఈ పాటతో ఇండస్ట్రీలో రామకృష్ణ పేరు మారుమ్రోగింది. ఘంటసాల వాయిస్ కి చాలా దగ్గరగా ఉందంటూ ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకున్నారు. ఘంటసాల అనారోగ్య కారణాల వలన అక్కినేని తన సినిమాలకు రామకృష్ణతోనే ఎక్కువగా పాడించారు. ఆ తరువాత ఎన్టీ రామారావు .. కృష్ణంరాజు .. శోభన్ బాబు ఆయనకు వరుస అవకాశాలనిస్తూ వెళ్లారు.

 Singer Ramakrishna

రామకృష్ణ స్వరం ఒక ప్రశాంత నిలయంలా ఉంటుంది .. అంతటా ఆహ్లాదాన్ని పరుచుకున్నట్టుగా ఉంటుంది. ఆ స్వరంలో విరహగీతాలు .. వియోగ గీతాలు ఒదిగిపోయేవి. ఇక హుషారైన పాటలకు కూడా చక్కిలిగింతలు పెడుతూ ఆయన పరుగులు తీయించారు. మెలోడీ గీతాలకు ఆయన స్వరం ఆధారమైంది .. ఆశ్రయమైంది. ఆయన మెలోడీలు వెన్నెల నదిలో తెప్పలా తేలే చందమామను సైతం నిద్రపుచ్చగలవు అన్నంత మధురంగా .. మనోహరంగా ఉండేవి. అప్పట్లో ఆయన పాడిన ప్రతి పాట హిట్ కావడంతో, ఆయన కెరియర్ దూకుడుగానే కొనసాగింది.

ఘంటసాలవారు తన వాయిస్ కి దగ్గరగా ఉన్న కారణంగా రామకృష్ణను ప్రోత్సహించారు .. ఒకానొక సమయంలో తన వారసుడు రామకృష్ణ అని చెప్పారు కూడా. అంతేకాదు తనతో కలిసి పాడే అవకాశం ఇచ్చారు .. ఆనారోగ్య కారణాల వలన తాను పాడలేని పాటలకు రామకృష్ణను సిఫార్సు చేశారు. అలా ఘంటసాలతో కలిసి రామకృష్ణ పాడిన పాటల్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని ‘తెలుగువీర లేవరా’ అనే పాట ముందువరుసలో నిలుస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఈ పాటను తలవని మనిషి లేడు .. ఈ పాట గెలవని మనసు లేదు.

Singer Ramakrishna

రామకృష్ణను ప్రోత్సహించిన దర్శకులలో ‘బాపు’ గారు ఒకరు. ఆయన తన సినిమాల్లో రామకృష్ణతో ఎక్కువ పాటలు పాడించారు. ‘ముత్యాలముగ్గు’ సినిమా కోసం రామకృష్ణ పాడిన ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు’ పాట ఎన్నిమార్లు విన్నప్పటికీ కొత్తగానే వినిపిస్తుంది .. అనుభూతుల పడవపై అలా అలా విహరింపజేస్తుంది. ‘నా జీవన సంధ్యా సమయంలో’ (అమరదీపం) .. ‘మధువొలకబోసే ఈ చిలిపి కళ్లు'(కన్నవారి కలలు) .. ‘నీ మనను నా మనసు ఏకమై’ (ఇదా లోకం) .. ‘జాబిల్లి చూసేను నిన్ను నన్ను’ (మహాకవి క్షేత్రయ్య) .. ‘ఆకాశం దించాలా’ ( భక్త కన్నప్ప) వంటి పాటలు రామకృష్ణ స్వర మాధుర్యానికి నిదర్శనం.

‘భక్త కన్నప్ప’తో పాటు ‘భక్త తుకారాం’ .. ‘చక్రధారి’ వంటి సినిమాల్లోని పాటలు, గాయకుడిగా రామకృష్ణ చేసిన విశ్వరూప విన్యాసంలా అనిపిస్తాయి. ఇప్పటికీ ఈ పాటలు తేనెవాగుల్లా .. అమృతధారల్లా హృదయ ద్వారాలను తాకుతూనే ఉంటాయి .. తన్మయులను చేస్తూనే ఉంటాయి. ‘అనుబంధము ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) .. వంటి విషాద గీతాలతో హృదయాలను కదిలించారు .. కరిగించారు. ‘ఒసేయ్ వయ్యారి రంగి’ (పల్లెటూరి బావ) వంటి హుషారైన గీతాలతో పడుచు మనసులను పరిగెత్తించారు.

‘కందం’ రాసినవారే కవి అన్నట్టుగా .. పద్యం పాడినవారే గాయకులు అనేవారు. అలా పద్యాలు పాడటంలోను తనకి తిరుగులేదనిపించుకున్న వారాయన. ‘దానవీరశూరకర్ణ’ సినిమాలో రాయబార ఘట్టంలో కృష్ణుడి కోసం రామకృష్ణ పాడిన పద్యాలు పంచదార గుళికలే. ఇలా రామకృష్ణ సినిమా పాటలతో పాటు అనేక ప్రైవేట్ గీతాలను ఆలపించారు. ఒక వైపున ఘంటసాల … మరో వైపున బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన వాయిస్ లోని కొత్తదనాన్ని .. మత్తుదనాన్ని అభిమానించేవారు .. ఆరాధించేవారు ఎంతోమంది ఉన్నారు. తేనె మాత్రల వంటి పాటలతో తీపియాత్రలు చేయించిన ఆ మధురగాయకుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఆయనను ఓసారి స్మరించుకుందాం.

(జూలై 16, సింగర్ రామకృష్ణ వర్ధంతి – ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : కథలో ఆత్మను చూపి(సి)న రచయిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్