ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులపై తమ అభిప్రాయాలను జత చేసి హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు – క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు.

క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2020 జనవరి 21న తమకు వచ్చిందని, తమ అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగిందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తమ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి జూన్‌ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు.

ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం శాఖ నుంచి తమ శాఖకు ఈ ఏడాది జనవరి 11న చేరిందని, దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేయడం జరిగిందని స్మృతి వివరించారు. ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *