ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురవడం.. యమునా నది ఉప్పొంగిపోవడంతో.. అక్కడ దోమలు పెరిగిపోయాయి. దీంతో ఆ వైరల్ జ్వరం కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి లక్షణాల్లో జ్వరం, కళ్ల మంట, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, కొన్ని సార్లు విరోచనాలు కూడా అవుతాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు ఢిల్లీలో 240 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గత వారంలో కొత్తగా 56 కేసులు నమోదు అయినట్లు మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్టులో తేలింది. భారీగా వచ్చిన వరదల్లో ఢిల్లీ మునిగిపోవడం వల్ల డెంగ్యూతో పాటు దోమల వల్ల సోకే ఇతర వ్యాధులు కూడా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది.
డెంగ్యూ ఎలా వస్తుంది..
నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లను దోమలు క్యారీ చేస్తుంటాయి. అలాంటి దోమలు కుట్టినప్పుడు మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. ఆ వైరస్ వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వైరస్ నేరుగా రక్తంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో అంతర్గతంగా బ్లీడింగ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వల్ల తీవ్రమైన లక్షణాలు డెవలప్ అవుతాయి. మనిషి నుంచి మనిషికి డెంగ్యూ వ్యాధి సోకదు.
డెంగ్యూ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం ఉంటుంది. తలనొప్పి, వొళ్లు, నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా తీవ్రంగా ఉంటాయి. కొందరికి ఉదరసంబంధిత సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో పాటు అలసిపోవడం కూడా జరుగుతుంది. దోమల పునరుత్పత్తిని ఆపడం వల్ల డెంగ్యూ వ్యాప్తిని అడ్డుకునే ఛాన్సు ఉంది. నీరు ఎక్కువగా నిలిచిపోకుండా చూసుకోవాలి. పువ్వుల కుండీలు, కూలర్ల లాంటి వాటిల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. వేడి చేసిన లేదా శుద్ధి చేసిన నీటిని తాగాలి. దోమ తెరలను కానీ, రెపల్లెంట్స్‌ను కానీ వాడండి. ఎప్పుడూ తాజా ఆహారాన్ని సేవించాలి. వీధి వ్యాపారుల ఆహారాన్ని ఆపేయాలి. పండ్లు, కూరగాయల్నిశుభ్రంగా కడగాలి.