క్లబ్ అంటే కేవలం మద్యం మత్తు, మసక వెలుతురు, అర్ధనగ్న నృత్యాల కేళి మాత్రమే కాదు…అది హరినామ స్మరణతో మార్మోగే ఒక పవిత్ర క్షేత్రం కూడా కాగలదని నేటి యువత నిరూపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న కొత్త నినాదం- ‘భజన్ క్లబ్బింగ్’.
ఆధ్యాత్మికతకు ‘కార్పొరేట్ గ్లామర్’
నిన్నటి వరకు భక్తి అంటే వృద్ధాప్యానికి సంకేతం అనుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. నైట్ క్లబ్బుల్లో డీజే బేస్ చప్పుళ్ల స్థానంలో వేద మంత్రాల వైబ్రేషన్లు వినిపిస్తున్నాయి. రాధికా దాస్, కేశవమ్ లాంటి యువ ప్రతిభాశాలురు భక్తి సంగీతాన్ని సరికొత్త ‘భారత్కోర్’ స్టైల్‌లో అందిస్తుంటే మెట్రో నగరాల్లోని యువత తన్మయత్వంతో ఊగిపోతోంది. ఇది కేవలం భజన కాదు…ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం.
మత్తు లేని మైమరుపు
ఈ మార్పులో అత్యంత ఆశావహ దృక్పథం ఏమిటంటే…ఇక్కడ మత్తు పదార్థాలకు తావు లేదు. టకీలా షాట్లు, కాక్టెయిల్ గ్లాసుల స్థానంలో వేడి వేడి ‘మట్టి కప్పు చాయ్’ (కుల్హద్ చాయ్) రాజ్యమేలుతోంది. మత్తు ఇచ్చేది క్షణికానందం అయితే, భక్తి ఇచ్చేది నిరంతర పరమానందం అని జెన్-జెడ్ యువత గుర్తిస్తోంది. దీనినే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘సోబర్ రేవ్’ (Sober Rave) అని పిలుస్తున్నారు. అంటే, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోకుండానే చిందులేయడం, సంగీతంతో తాదాత్మ్యం చెందడం.

ఆర్థిక చోదక శక్తిగా ‘కల్చరల్ ఎకానమీ’
ఈ మార్పు కేవలం భావజాలానికే పరిమితం కాలేదు. ఇది ఒక భారీ ఆర్థిక విప్లవానికి కూడా నాంది పలికింది.
- మార్కెట్ విలువ: సుమారు రూ. 20,000 కోట్ల లైవ్ ఈవెంట్ మార్కెట్‌ను ఈ భజన్ క్లబ్బింగ్ ప్రభావితం చేస్తోంది.
- బడ్జెట్ ప్రాధాన్యం: కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో ‘కల్చరల్ ఎకానమీ’ని దేశాభివృద్ధికి చోదక శక్తిగా గుర్తించడం విశేషం.
- గ్లోబల్ మార్కెట్: ఇండియాలోని మెట్రో నగరాలతో పాటు దుబాయ్, లండన్ లాంటి ప్రాంతాల్లో కూడా మన భక్తి సంగీతానికి డిమాండ్ పెరగడం గమనార్హం.
మన సంస్కృతికి పట్టాభిషేకం
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఆధునికత, సంప్రదాయాల అద్భుత సమ్మేళనమే ఈ భజన్ క్లబ్బింగ్” అని ఆయన కొనియాడారు. మన సంస్కృతిని ఆధునిక జీవనశైలికి అనుగుణంగా మార్చుకుంటూనే, విలువలను కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదు.

స్టైలిష్’ సనాతనం…నవతరం ఆధ్యాత్మికత
లోకం ఎప్పుడూ మార్పును కోరుకుంటుంది. కానీ ఆ మార్పు మన వేళ్లను పటిష్టం చేసేలా ఉండాలి. పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించే స్థితి నుండి, మన వేద సంస్కృతిని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పే స్థాయికి నేటి యువత ఎదగడం ఒక శుభపరిణామం. చెడు అలవాట్లకు దూరంగా, సనాతన ధర్మానికి దగ్గరగా జరుగుతున్న ఈ ప్రయాణం రేపటి ‘నవ భారతాన్ని’ ఆవిష్కరించడంలో ఒక ముందడుగు కాగలదు. “ఆధ్యాత్మికతను ఒక ‘బోరింగ్’ అంశంగా కాకుండా, అత్యంత ‘వైబ్రెంట్’గా, ‘స్టైలిష్’గా మార్చుకున్న ఈ తరం అభినందనీయం. క్లబ్బుల్లో వినిపించే వేద మంత్రాల వెనుక కేవలం సంగీతం లేదు, ఒక జాతి మేల్కొలుపు ఉంది. వ్యసనాల మత్తులో జోగడం కంటే, భక్తి పారవశ్యంలో ఓలలాడడం వెయ్యి రెట్లు మెరుగని నేటి యువత చాటి చెబుతోంది. ఈ ఆధునిక ఆధ్యాత్మిక విప్లవం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో భారతీయ సంస్కృతి ప్రపంచానికే మార్గదర్శకమైన భవిష్యత్తు అవుతుంది. మన మూలాలను మనం ప్రేమించినప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

