A disciplined hero: తెలుగు తెరకి పరిచయమైన కథానాయకులలో శోభన్ బాబు స్థానం ప్రత్యేకం. నటుడిగా శోభన్ బాబును ఎంతగా ఇష్టపడతారో .. వ్యక్తిగా ఆయనను అంతే అభిమానిస్తారు .. ఆరాధిస్తారు. శోభన్ బాబు అంటే ఒక పద్ధతి .. ఒక క్రమశిక్షణ. అవి ఆయన తెచ్చిపెట్టుకోలేదు .. స్వతహాగా వచ్చినవే. అందుకే అవి చివరి వరకూ ఆయనను అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇక శోభన్ బాబుకి ఇతరులను విమర్శించే అలవాటు లేదు .. తన సమక్షంలో ఇతరులను విమర్శిస్తే ఆయన ఒప్పుకోరు. సాధ్యమైనంత వరకూ మనసును కలుషితం చేసుకోకూడదనే ఆయన చెప్పేవారు .. అదే ఆయన ఆరోగ్య రహస్యం కూడా.
శోభన్ బాబు అసలుపేరు .. ఉప్పు శోభనాచలపతిరావు. కృష్ణా జిల్లా ‘చిన నందిగామ’లో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. మైలవరం .. విజయవాడలలో ఆయన చదువు కొనసాగింది. అప్పట్లో సహజంగానే కుర్రాళ్లకి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అలాగే ఆయన కూడా నాటకాలు వేయడం మొదలుపెట్టారు. శోభన్ బాబు కనుముక్కుతీరు చాలా బాగుంటుంది. అందువలన సినిమాలలో ప్రయత్నాలు చేయమని స్నేహితులు ప్రోత్సహించారు. దాంతో ఆయన చెన్నై కి చేరుకుని అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు.
శోభన్ బాబుకి మొదటి నుంచి కూడా మొహమాటం ఎక్కువ. అందువలన స్టూడియోలకి వెళ్లేవారుగానీ .. అవకాశం అడగడానికి మాత్రం అంతగా ధైర్యం చేసేవారు కాదు. ఎక్కడ చూసినా అంతా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ గురించే మాట్లాడుకుంటూ ఉంటే, అలాంటి ఒక రోజు తనకి కూడా రావాలనే పట్టుదల ఆయనలో పెరగసాగింది. మంచి ఛాన్స్ వస్తేనే చేయాలనే ఆలోచన ఆయనకి లేదు. ఎందుకంటే అప్పటికే పెళ్లై భార్య పిల్లలు ఉండటం వలన, ఏ చిన్న అవకాశం వచ్చినా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ‘దైవబలం’ సినిమాతో 1959లో ఆయన కెరియర్ మొదలైంది.
ఆ తరువాత పదేళ్లపాటు ఆయన ముఖ్యమైన పాత్రలతోనే కెరియర్ ను నెట్టుకొచ్చారు. హీరోగా చెప్పుకుంటే ‘వీరాభిమన్యు’ .. ‘బంగారు పంజరం’ హిట్లు తెచ్చిపెట్టాయి. 70వ దశకంలో శోభన్ బాబు కెరియర్ ఊపందుకుంది. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో ఏర్పడిన పరిచయాలు ఆయన కెరియర్ కి హెల్ప్ అయ్యాయి. అలాగే శోభన్ బాబు ప్రవర్తన కూడా ఆయనకంటూ కొంతమంది నిర్మాతలను సంపాదించిపెట్టింది. ఈ దశకంలో ఆయన ఏడాదికి 10 నుంచి 12 సినిమాలు చేశారు. ఏడాదికి 16 సినిమాలు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.
‘చెల్లెలి కాపురం’ .. ‘బలిపీఠం’ .. ‘కార్తీక దీపం’ .. ‘మల్లెపువ్వు’ .. ‘సోగ్గాడు’ సినిమాలు శోభన్ బాబుకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పంచెగట్టి .. ముల్లుగర్ర చేతబట్టి .. కిర్రు చెప్పులతో పొలం గట్లపై నడిచిన ఈ సోగ్గాడిని అప్పట్లో అనుకరించని వారు లేరు. 80వ దశకంలో శోభన్ బాబు తెరపై మరింత హ్యాండ్సమ్ గా కనిపించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. రింగ్ తో కూడిన హెయిర్ స్టైల్ ను సెట్ చేసుకోవడమే కాకుండా, పాటల్లోను స్పెట్స్ పెట్టుకోవడం .. మఫ్లర్ ధరించడం చేశారు. ఇద్దరు కథానాయికలతో కూడిన కథలకు ప్రాధాన్యతనిస్తూ రొమాంటిక్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. మహిళా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
శోభన్ బాబుకి ముందుగానీ .. ఆ తరువాత గాని అంతగా మహిళాభిమానులను సొంతం చేసుకున్న హీరో మరొకరు లేరు. అందాల నటుడు కితాబును భుజాన వేసుకుని ఆయన వరుస హిట్లతో విజృంభించారు. ‘దేవత’ .. ‘స్వయంవరం’ .. ‘ఇల్లాలు ప్రియురాలు’ .. ఇలా ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. వాణిశ్రీ – శారద, ఆ తరువాత శ్రీదేవి – జయసుధ ఆయన జోడీగా బాగా నప్పేవారు. ఈ నలుగురిలో ఆయన ఎవరి సరసన చేసినా, హిట్ పెయిర్ అనిపించడం విశేషం. శోభన్ బాబు తన సినిమాల్లో పాటలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. అలాగే కాస్ట్యూమ్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ‘మహా సంగ్రామం’ వంటి మల్టీ స్టారర్లు చేసినా వాటి సంఖ్య చాలా తక్కువే.
తనకి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల పట్ల శోభన్ బాబు ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరించేవారు. అలాగే తన తోటి హీరో అయిన కృష్ణతో ఆయన ఎంతో స్నేహంతో మెలిగేవారు. కృష్ణ తల్లి శోభన్ బాబును కూడా ఒక కొడుకుగా భావించడం ఆ ఇద్దరి మధ్య గల స్నేహానికి అద్దం పడుతుంది. శోభన్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆయన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తన వెనుక పిసినారి అని కొందరు ప్రచారం చేసినా ఆయన పట్టించుకోలేదు. తనని ఆశ్రయించినవారికి ఆయన చేసిన గుప్తదానాలు ఎక్కువే.
దాదాపు మూడు దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమను శోభన్ బాబు చాలా దగ్గర నుంచి చూశారు. తనకి ఎదురైన అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్నారు. చిత్రపరిశ్రమలో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడటం ఎంతకష్టమనేది ఆయనకి తెలుసు. అందువల్లనే తన పిల్లలను ఆయన అటువైపుకు రానీయలేదు. తనకి ముందున్న ఆర్టిస్టులు సొంత సినిమాలు తీసి ఎలా ఇబ్బందులు పడుతున్నది చూసిన ఆయన, సొంత సినిమాల ఆలోచన చేయలేదు. ముందుచూపుతో స్థిరాస్తులను పెంచుకుంటూ వెళ్లిన ఆయన, అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగించారు. శోభన్ బాబు తరువాత చాలామంది అందగాళ్లు తెరపైకి వస్తున్నారు .. కానీ అందగాడంటే ఇప్పటికీ శోభన్ బాబే. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.
(శోభన్ బాబు జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ