Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసోషల్ మీడియా పైత్యం

సోషల్ మీడియా పైత్యం

What a Post!
నవ్వొస్తుంది.
ఇదిగో పులి అంటే, అదుగో తోక అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఇదే.
ఏ మాటకామాట, మోడీకానీ,
ఆయన కేబినెట్ లో మంత్రులు కానీ ఈ మాటలెప్పుడూ అన్లేదు.
ఆయన భక్తులే అవసరానికి మించి భక్తిని ప్రదర్శిస్తూ వుంటారు.
బోడిగుండుకి, మోకాలికీ ముడిపెట్టడం గురించి వినే వుంటాం.
స్కాచ్ విస్కీకి బ్రిటన్ మంత్రి పదవికి ముడి పెట్టేశారు.
బ్రిటన్ మంత్రి సుయెల్లా బ్రేవర్మేన్ ఏదో అన్నదట.
మోడీ కన్నెర్ర జేశాడట.
వేల కోట్ల స్కాచ్ విస్కీ ఎగుమతులు ఆగిపోయాయట,
దెబ్బకి అక్కడి మంత్రి ఉద్యోగం ఊడిపోయిందట.

కొద్దిరోజులుగా హిందీ, ఇంగ్లీష్ లో ఒక వర్గం మీడియా కోడైకూస్తున్న కూతలే ఇవన్నీ..
ఇందాకే ఎఫ్ బి చూస్తుంటే తెలుగులోకి కూడా తర్జుమా అవుతున్నాయి.
అవునా.. నిజమా.. అని డౌటనుమానం వచ్చింది.
కాస్త లోపలికి వెళ్ళి చూస్తే, జాతిరత్నాలను మించిన కామెడీ ఇదని అర్థమైంది.

ముందు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి.
మొదటి నిజం… ప్రధాని మోడీ బ్రిటన్ తాజా పర్యటన రద్దు చేసుకున్నారు.
రెండో నిజం.. ఇండియా-బ్రిటన్ మధ్య జరగాల్సిన స్వేఛ్ఛా విపణి ఒప్పందంలో విస్కీ మీద దిగుమతి సుంకాలు తగ్గించాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్..
మూడో నిజం.. బ్రిటన్ హోమ్ మంత్రి సుయెల్లా బ్రేవర్మేస్ తన పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు.
నాలుగో నిజం(పాక్షికంగా అయినా సరే) మంత్రిగా వుండగా సుయెల్లా బ్రేవర్మేస్ భారతీయ వలసదారుల గురించి కొన్ని వివాదస్పద (ఇండియా దృష్టిలో) వ్యాఖ్యలు చేశారు.
ఏ మాత్రం సంబంధంలేని ఈ నాలుగు నిజాలతో అవసరానికి తగ్గట్టు అందమైన కట్టుకథని అల్లేయడం, అందులో కాసింత దేశభక్తిని చల్లేయడంలోనే క్రియేటివిటీ అంతా దాగుంది.

ఇప్పుడు భక్త మీడియాలో వచ్చిన కథేంటో చెప్పుకుందాం.
ఇండియన్ మైగ్రెంట్స్ గురించి హోమ్ మంత్రి సుయెల్లా బ్రేవర్మేన్ అవాకులు చెవాకులు పేలిందట.
దానివల్ల ఇండియా ఠాట్ ఇలా మాట్లాడతావా.. నువ్వు వద్దు నీ విస్కీ వద్దు అనేసిందట.
అక్కడితో ఆగకుండా అసలు బ్రిటన్ కే రాను అని మోడీ తన టూర్ కేన్సిల్ చేసుకున్నాడట.
ఇంకేముంది.. బ్రిటన్ గజగజ వణికి పోయింది.
నోర్మూసుకుని చెంపేలేసుకుని మంత్రిపదవికి రాజీనామా చేయమని బ్రేవర్మేన్ ని ఆదేశించింది.
ఆమె జీ హుజూర్ అని రాజీనామా చేసేసింది.

బావుంది కదా.. వినడానికి బాగా కన్విన్సింగ్ గా వుంది కదా..
మన దేశభక్తి రోమాలు నిక్కబోడుచుకున్నాయి కదా..
కానీ,. దురదృష్టవశాత్తూ అసలు కత వేరేవుంది.
మోడీ టూర్ కేన్సిల్ చేసుకున్నది… బ్రేవర్మేన్ మీద అలిగికాదు..
ఈ అక్టోబర్ కల్లా ఫ్రీట్రేడ్ ఒప్పందం మీద సంతకాలు చేసుకోవాలని బోరిస్ జాన్సన్ ప్రధానిగా వున్నప్పుడు జాన్సన్- మోడీ ఒక అంగీకారానికి వచ్చారు.

Britain Home Minister Resignation
అందులో భాగంగానే మోడీ దీపావళికి ఒప్పందం చేసుకుందాం అనుకున్నారు.
అయితే, ఇంకా రెండు దేశాల మధ్య కొన్ని అంశాలమీద ఏకాభిప్రాయం కుదర్లేదు.
ఈలోగా అక్కడ రాజకీయాలు కూడా గందరగోళంగా మారాయి.
బోరిస్ పోయి.. ఆ తర్వాత వచ్చిన లిజ్ ట్రస్ కూడా రాజీనామా చేసింది.
ఈ దశలో ఈ సంతకాలు అయ్యే పని కాదని మోడీ తన టూర్ కేన్సిల్ చేసుకున్నాడు.
బ్రేవర్మేన్ రాజీనామా చేసింది కానీ, కారణం తన వ్యాఖ్యలు, ఇండియా ఆగ్రహం కాదు.

ఒక అధికారిక సమాచారాన్ని తన వ్యక్తిగత మెయిల్ నుంచి మరో వ్యక్తికి బ్రేవర్మన్ పంపింది.
దానిమీద వివాదం చెలరేగింది.
సాంకేతికంగా, నైతికంగా ఇది తప్పే అని అంగీకరిస్తూ, బ్రేవర్మన్ రాజీనామా చేసింది.
పాశ్చాత్య దేశాల్లో ఈ మెయిల్స్ గొడవ చాలా పెద్దది.
అంతకు ముందు హిల్లరీ క్లింటన్ కూడా దీని బాధితురాలే.
బ్రేవర్మన్ భారతీయ వలస దారుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినా,
ఈ ఫ్రీట్రేడ్ ఒప్పందాన్ని మద్దతునిచ్చిన నేతలలో ఆమె కూడా ఒకరు.

Britain Home Minister Resignation

ఇక విస్కీ గొడవొకటుంది కదా..
విదేశీ విస్కీల మీద ఇండియాలో 150 శాతం దిగుమతి సుంకం వుంది.
మనకొస్తున్న విదేశీమద్యాలలో అగ్రభాగం 34శాతం బ్రిటన్ నుంచే వస్తున్నాయి.
ఇక బ్రిటన్ నుంచి ఇండియాకి దిగుమతి అయ్యే ఫుడ్ అండ్ బేవరేజస్ లో 80 శాతం వాటా ఈ మద్యానిదే.
ఈ మధ్యే ఆస్ట్రేలియాతో ఇండియా చేసుకున్న ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ లో అక్కడి మద్యం దిగుమతుల సుంకాల మీద కొన్ని రాయితీలు ఇచ్చింది.
దాంతో తమ స్కాచ్ కి కూడా అలా ఇవ్వాలని బ్రిటన్ అడుగుతోంది.
దీనిమీద ఇంకా ఇండియా ఒక నిర్ణయానికి రాలేదు.
ముందు తమ స్కిల్డ్ లేబర్, స్టూడెంట్స్ కి విసా సరళీకరణ అంశం తేల్చాలని ఇండియా డిమాండ్ చేస్తోంది.
అదీ సంగతి..
విదేశీ వ్యవహారలంటే గట్టు పంచాయితీలు కాదు..
ఈ గడ్డ మీద ఎన్ని రాజకీయాలు చేసినా.. విదేశాలతో వ్యవహరించేటప్పుడు ఒక డిగ్నిటీ వుంటుంది.
ఏ పార్టీ ప్రభుత్వంలో వున్నా కొన్ని మర్యాదలు పాటిస్తుంది.
మన సోషల్ మీడియా రచయితలకే ఆ మర్యాద తెలియదు.

– కె. శివప్రసాద్

Also Read :

బ్రిటన్- రాణి- రాజు

Also Read :

ఒక కమల, ఒక రుషి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్