Indian Interests: సంజయ్ బారు జగమెరిగిన రాజకీయ విశ్లేషకుడు. భారత ప్రధాన మంత్రి మీడియా వ్యవహారాలు చూసినవాడు. పబ్లిక్ పాలసీల మీద అనేక జాతీయ, అంతర్జాతీయ విద్యాలయాల్లో పాఠాలు చెబుతున్నవాడు. తెలుగువాడు. ఐ ఏ ఎస్ అధికారిగా, ఆర్థిక వ్యవహారాల నిష్ణాతుడిగా పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న బి పి ఆర్ విఠల్ కొడుకు.
బ్రిటన్ లో ప్రధాని పదవి పరుగు పందెంలో భారత మూలాలున్న రుషి సునాక్ ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో “రుషి, కమలా ఔర్ హమ్” అన్న శీర్షికతో Why Indian- origin leaders in key foreign governments aren’t always good news for India? అన్న ప్రశ్నతో
సంజయ్ బారు టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రిక ఎడిట్ పేజీలో వ్యాసం రాశారు. ఆయన విశ్లేషణలో ప్రధానాంశాలివి:-
1. బ్రిటన్- భారత్ సంబంధాలు, ప్రయోజనాల కోణంలో చూసినప్పుడు భారత మూలాలున్న రుషి బ్రిటన్ ప్రధాని కావడం కంటే బ్రిటీష్ పౌరుడు ప్రధాని కావడమే భారత్ కు మంచిది.
2. అమెరికాలో భారత్ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు ప్రతి క్షణం అమెరికా ప్రయోజనాల వైపే నిలబడాలి. లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు పాడవుతుంది.
3. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రవాసీ భారతీయులు లేదా భారత సంతతికి చెందినవారు కీలకమయిన స్థానాల్లోకి వెళ్లడం భారతీయులుగా మనకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది కానీ…ఇది రెండంచుల కత్తి లాంటిది. ఒక్కోసారి ఇది అసూయకు, ఇతర అగ్ని పరీక్షలకు కారణం కావచ్చు.
4. మలేసియాలో భారత సంతతి ప్రధాని మహాతిర్ మొహమ్మద్ ప్రధానిగా ఉన్నప్పటికంటే నిఖార్సయిన మలేసియా వాసి నజీబ్ అబ్దుల్ రజాక్ ప్రధానిగా ఉన్నప్పుడే భారత్ కు హాయిగా ఉంది.
5. పలు దేశాల్లో కనీసం 200 మంది ప్రవాసీ భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
6. ఏదో ఒక రోజు కెనడాకు ఒక ప్రవాసీ భారతీయుడు ప్రధాని అయినా కావచ్చు.
7. కొన్ని దేశాల్లో పౌర స్వేచ్ఛ, మానవ హక్కులకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అలాంటి దేశాల్లో భారతీయ మూలాలున్న నాయకులు ఉన్నత స్థానాల్లోకి వెళ్లగానే…భారత్ లో పౌరహక్కులు, ఇతర వ్యవహారాల మీద పోలికలు, చర్చలు మొదలవుతాయి.
8. ప్రధానమయిన దేశాల్లో భారత మూలాలున్నవారు అగ్రస్థానాల్లోకి వెళ్లే కొద్దీ…భారత ప్రభుత్వానికి ద్వైపాక్షిక వ్యవహారాలు కత్తి మీద సాము అవుతున్నాయి.
ఇప్పుడు చర్చలోకి వెళదాం. ఉదాహరణకు రుషి రేప్పొద్దున బ్రిటన్ ప్రధాని అవుతాడనే అనుకుందాం. భారత్ నుండి బ్రిటన్ వచ్చేవారికి ఆహ్వానం పలకడానికి లండన్ హీ త్రూ విమానాశ్రయంలో ఆయనేమన్నా ఒక ప్రత్యేక డెస్క్ పెట్టగలరా?
అమెరికాలో కమలా భారతీయులకు ఏమయినా శాశ్వత అమెరికా పౌరసత్వ గ్రీన్ కార్డులు నాలుగు ఎక్కువగా ఇప్పించగలరా?
మిగతావారికంటే ఇలాంటివారికి ప్రతిక్షణం శీలపరీక్షలా ఉంటుంది. ఇంట్లో ఇడ్లి సాంబారు, పంచె, చీర, పూజలు, వ్రతాలు ఓకే కానీ…బయటి ప్రపంచానికి ఆ దేశపు సగటు మనిషిలానే ఉండాలి. లేదా వారికంటే ఎక్కువగా కూడా ఆ దేశాభిమానాన్ని చాటుకోవాలి.
ఇలాంటప్పుడు అంతర్జాతీయంగా అగ్రస్థానాల్లో కమల, విమల, జలజ, వనజ, రుషి, పటేల్, సింగ్, మూర్తి, రావు లాంటి భారతీయ పేర్లు విని మనం ఆత్మానందం పొందడమే తప్ప...భారతదేశానికి వీసమెత్తు కూడా ఉపయోగం ఉండదు.
ఇంకా లోతుగా వెళితే…
రుషి గ్రేట్ బ్రిటన్ ప్రధాని అయి…ఏదో ఒక విషయంలో భారత్ కు వ్యతిరేకంగా ఏదో నిర్ణయం తీసుకున్నాడని అనుకుందాం. ఇక్కడ బెంగళూరులో ఆయన అత్తామామలు ఇన్ఫోసిస్ నారాయణ-సుధా మూర్తులు బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తుంది.
అందుకే ఎలిమెంటరీ స్కూల్లోనే-
“Be a Roman in Rome”
అని నేర్పుతారు. మనం సామెతను బట్టీ పడతాం కానీ…ఆచరణలో మాత్రం…
బ్రిటన్లో భారతీయుల్లా, భారత్ లో బ్రిటిషువారిలా ఉండాలని అనుకుంటాం. ఉండడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. ఉండలేకపోతే మనల్ను మనమే తిట్టుకుంటాం.
ఏ దేశంలో అయినా మనవారు శిఖరాగ్రానికి చేరవచ్చు. చేరుతున్నారు కూడా. కానీ వారివల్ల భారతదేశానికి దౌత్యపరమయిన లాభనష్టాల గురించి ఆలోచించినప్పుడు మాత్రం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని విదేశీ వ్యవహారాల నిపుణులు పెదవి విరుస్తున్నారు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :

తెలుగు, జర్నలిజం, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో ఇరవై ఏళ్ల పాటు జర్నలిస్టుగా అనుభవం. 15 ఏళ్లుగా మీడియా వ్యాపారం. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, వెబ్ సైట్లలో కాలమిస్టుగా పాతికేళ్ళ అనుభవం.