Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ తప్పిదాలు

బ్యాంకుల్లో సాఫ్ట్ వేర్ తప్పిదాలు

Two school boys become richer due to software error

సాఫ్ట్ వేర్ అనే మాటకు తెలుగు పదం ఏమిటో ఈనాడు పత్రిక కనిపెట్టాలి. సాఫ్ట్- మెత్తటి వేర్ – తొడుగు…కలిపి మెత్తటి తొడుగు, హార్డ్ వేర్ – గట్టి తొడుగు అని అనువదించుకునే అవకాశాన్ని మనమే అందిపుచ్చుకోవాలి.

గూగుల్ ను అడిగితే మృదు సామగ్రి: మేధోత్పాతం అని అశనిపాత యంత్రానువాద భాషలో చెబుతోంది. గుడ్డి గూగుల్ అనువాదంలో హాస్యం ఉన్నా…ఆ హాస్యంలోనే చార్లీ చాప్లిన్ ప్రకటించే
విషాదం ఉంది.
వినోదం ఉంది.
అభాస ఉంది.
తడబాటు ఉంది.
చమత్కారం ఉంది.
అమాయకత్వం ఉంది.
చివర అంతులేని విధ్వంసం ఉంది.

సాఫ్ట్ వేర్ దానికదిగా పుట్టేది కాదు. ఒకరు పుట్టించాలి. దానికి తెలిసే కోడ్ భాషలో రాసి, ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో పడేసి, కాస్త కరెంటు పెట్టి, కీ ఇచ్చి వదిలితే అప్పుడు ఆ సాఫ్ట్ వేర్ తనకు తాను పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాంటి సాఫ్ట్ వేర్ ను గూగుల్ మేధ ప్లస్ ఉత్పాతం- “మేధోత్పాతం” అని గుణసంధి గుణంగా తనను తాను అనువదించుకుని చెప్పుకోవడం కాకతాళీయం, కీ బోర్డు తాళీయం, విండోస్ తాళీయం కాకపోవచ్చు.

యంత్ర మేధ ఎంత ఉత్పాతంగా, ఉపద్రవంగా పరిణమించిందో మేధోత్పాతం మాట ద్వారా గూగుల్ చెప్పకనే చెబుతోంది. ఇది అకాకతాళీయం.

సాఫ్ట్ వేర్ అనగా మేధోత్పాతానికి ఇటీవలి కొన్ని ఉదాహరణలు చూడండి.

1 . బీహార్ లో ఒక నిరుపేద రైతు పెన్షన్ ఖాతాలోకి బ్యాంక్ మేధోత్పాతంతో జరిగిన ఉత్పాతం వల్ల 52 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.

2 . అదే బీహార్లో ఒక బడి పిల్లాడి ఖాతాలో మేధోత్పాతం 900 కోట్ల రూపాయలను జమ చేసింది.

3 . బీహార్ లోనే ఇంకో బడి పిల్లాడి ఖాతాలో మేధోత్పాతం 6 కోట్లను జమ చేసింది.

4 . మరో రైతు ఖాతాలో మేధోత్పాతం అయిదున్నర లక్షలు జమ చేసింది. మా ప్రధాని ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అందులో మొదటి విడత ఇదే…అని ఆ రైతు ఆ డబ్బును వాడేసుకుని తరువాతి విడత కోసం బ్యాంకువారిని నిలదీశాడు.

మా బ్యాంక్ నమ్మిన మేధోత్పాతం వల్ల ఇంత ఉత్పాతం జరిగిందని ఆయా బ్యాంకులు ఎంతగా నెత్తీ నోరు కొట్టుకున్నా ఉత్పాత లబ్ధిదారులు వెనక్కు ఇవ్వలేదు. చివరకు పోలీసు కేసులు పెట్టి ఉత్పాత నగదు బదిలీ ఉపద్రవ ప్రవాహ సొమ్మును తిరిగిరాబట్టుకున్నారు.

సాఫ్ట్ గా దోచుకోవడమే ఆధునిక ధర్మం. దానికి ” సాఫ్ట్ వేర్” కూడా తోడయితే ఇక ఉత్పాతానికే మహా “మేధోత్పాతం” అని తెలియజెప్పే “మృదు సామగ్రి” పాఠాలివి.

వెధవది!
మన బ్యాంక్ మృదు సామగ్రి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మన అకౌంట్లోకి ఇలాంటి మేధోత్పాత ప్రమాద జనిత ధన ప్రవాహాన్ని బదిలీ చేయలేదు. వెనక్కు తీసుకుంటే తీసేసుకున్నారు. ఒక్క పూట మన అకౌంట్లో 900 కోట్ల బ్యాలెన్స్ కనపడితే…ఆ సున్నాలను కనీసం ఐ ఐ టి రామయ్యతో అయినా లెక్క కట్టించేవాళ్లం. ఆపాటి మేధోత్పాత మృదు సున్నాలకు కూడా నోచుకోని నిరుపేదలం!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: మతిమరుపు మా జన్మ హక్కు

Also Read:ఇకపై వర్చువల్ ప్రాణులు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్