Amaravathi Corporation: అమరావతి కార్పొరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. అమరావతిని స్మశానంగా కొందరు మంత్రులు వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే ప్రాంతంలోని 481 ఎకరాలను బ్యాంకులకు తాకట్టుపెట్టి 2,994 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలంటూ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని సోమిరెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వం చెప్పిన విధంగానే ఒక్కో ఎకరం 7 కోట్ల రూపాయలు అయితే 34 వేల ఎకరాలు 2 లక్షల 38 వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాటి ప్రధానమంత్రి మోడీ, సిఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ లను నమ్మి ఇన్ని వేల ఎకరాల భూమి ఇస్తే జగన్ ప్రభుత్వం వారిని మానసిక క్షోభకు గురి చేసిందని, ఇప్పుడు ఆ భూమినే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని 29 గ్రామాలను 19కి కుదిస్తూ ఈ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని… తుళ్ళూరు మండలంలో 16; మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకున్నారని, తాడేపల్లిలో 2, మంగళగిరిలో 4, మరో నాలుగు కలిపి మొత్తం 10 గ్రామాలను తీసేశారని వివరించారు. ప్రజలను వంచించడం, హింసించడం హింసిస్తే తప్ప సిఎం జగన్ కు, మంత్రులకు నిద్ర పట్టేట్లు లేదని వ్యాఖ్యానించారు.
ప్రతిపాదిత అమరావతి క్యాపిటల్ కార్పోరేషన్ పై హైకోర్టు అనుమతి తీసుకోవాలని, 29 గ్రామాలను ఈ కార్పోరేషన్ లో కలపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
Also Read : కార్పొరేషన్ గా అమరావతి