My Intention is...కడప విమానాశ్రయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తింది. వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు వరప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో వీర్రాజు వివరణ ఇచ్చారు.
నిన్న విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవు కానీ జిల్లాకో ఎయిర్ పోర్ట్ కడతామని జగన్ ప్రభుత్వం చెబుతోందని వీర్రాజు ఎద్దేవా చేశారు. కడపలో ఎయిర్ పోర్ట్ గురించి ప్రస్తావిస్తూ ‘ప్రాణాలు తీసేసే వారి జిల్లలో కూడా ఎయిర్ పోర్ట్ , వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాయలసీమ నేతలు తీవ్రంగా స్పందించారు.
కడప ఎయిర్ పోర్ట్ సోము వీర్రాజు ఇచ్చింది కాదని బ్రిటిష్ వారి కాలంలోనే అక్కడ ఎయిర్ పోర్ట్ ఉందని, రవాణా సదుపాయం కోసం అది కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘ మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారో కానీ మీ వ్యాఖ్యలతో మేం చాలా బాధ పడుతున్నాం’ అన్నారు. తెలుగుదేశం పార్టీ హయంలోనే ఫ్యాక్షన్ సంస్కృతిని రాయలసీమలో ప్రోత్సహించారని, చంద్రబాబు కూడా ఇలాగే మాట్లాడతారని, ఇప్పుడు వీర్రాజు చేసిన కామెంట్లు చాలా అభ్యంతరకరమని, తమ మనోభావాలను దెబ్బ తీశాయని, అయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నేతలు ఎవరైనా ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారు తమను అగౌరవ పరిచినట్లే భావిస్తామని, అంతేకాకుండా రాజకీయంగా ఇక్కడ తిరిగే హక్కు కూడా కోల్పోతారని హెచ్చరించారు. తమ ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గుతూ కూడా ఇతర ప్రాంతాల వారు బాగుండాలని కోరుకుంటారని చెప్పారు.
మరోవైపు వీర్రాజు వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివవరప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అయన వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని, అయన కనిపిస్తే జిల్లా ప్రజలు దాడి చేస్తారని అన్నారు. తాను ప్రజాస్వామ్య వ్యవస్థలో లేకపోయి ఉంటే వీర్రాజు నాలుక కోసి ఉండేవాడినంటూ రాచమల్లు ఘాటుగా వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై వీర్రాజు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని అయన విడుదల చేశారు. హత్యా రాజకీయాలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా అర్ధం చేసుకున్నారని, కడప జిల్లా ప్రజలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారన్నది తన ఉద్దేశం కాదని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావిస్తూ అలా మాట్లాడానని వీర్రాజు వివరణ ఇచ్చారు. ఈ హత్యలో కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉండనే వార్తలు వస్తున్నాయని దీన్ని మనసులో పెట్టుకొనే ఆ విధంగా మాట్లాడానని వెల్లడించారు.
Also Read : ఇప్పుడే గుర్తొచ్చిందా?: సోము