రైతులకు తుంపర, బిందు సేద్యం, ఆధునిక యంత్ర పరికరాల పంపిణీలో రాష్ట్రం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. డ్రిప్ ఇరిగేషన్ కు కనీసం టెండర్లు కూడా పిలవలేదని ఆరోపించారు. కడపలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు, ఈ ధర్నాకు సోము హాజరయ్యారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 900 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్లిందని అయన గుర్తు చేశారు. రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.
అంతకుముందు ప్రొద్దుటూరులో వీర్రాజు పర్యటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను అయన పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. వైసీపీ దాడులపై పోరాటం చేస్తామని, రాబోయే రోజుల్లో టిడిపికి పట్టిన గతి వైసీపీకి కూడా పడుతుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ తమ పోరాటం కొనసాతుగుందని స్పష్టంచేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి బిజెపి బలోపేతానికి పటిష్టమైన కార్యక్రమాలు ఓ ప్రణాళిక ప్రకారం చేపడుతున్నామని చెప్పారు.