Modis Rule : కాంగ్రెస్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబర్‌లో ప్రసగించిన ఆమె…. కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ చింతన్ శిబిర్ మూడు రోజుల మేధోమథన సమావేశాన్ని ఇవాళ ప్రారంభించారు. బిజెపి, ప్రధాని మోడీపై ఘాటైన విమర్శలతో ఆమె కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజల్లో నిరంతరం అభద్రతాభావం నింపుతోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా మైనార్టీలపై దాడులు నానాటికీ ఎక్కువవుతున్నాయని సోనియా ఆక్షేపించారు.
మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, రాజ్యాంగ సంస్థలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని సోనియా ఆరోపించారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణాన్ని పెంచుతున్నారని, ఈ కారణాల వల్ల సమాజంలో తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సామరస్యత పెంచాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం “మనేరగా” ( పనికి ఆహార పధకం) చట్టం, ఆహార భద్రత చట్టం ప్రజాహితం కోసం తెచ్చిందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మోడీ పాలన కొనసాగితే దేశం దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఐక్యత, దేశ సమగ్రత, ఆత్మ విశ్వాసం, నిబద్దత తో పనిచేసిందుకు “నవ సంకల్ప్ శిబిర్” వేదికపై దృఢ సంకల్పం తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం
పూర్తిస్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయం, సమానత్వం, లౌకికవాదాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. ఆదివాసీలు, మహిళలు, దళితులపై రోజు రోజుకీ దాడులు పెరుగుతున్నాయని, దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి. అందుకు అనుగుణంగా వాతావరణాన్ని పునరుద్దరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కుటుంబంలో ఒకరికే పోటీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సోనియా వ్యాఖ్యలతో… పార్టీని సంస్కరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవస్థాగతంగా పార్టీలో సమూల మార్పులు జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు సోనియాగాంధీ. మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అత్యవసరమన్నది సోనియా ప్రసంగం సారాంశం.. అయితే, ఈ మార్పులు గాంధీ కుటుంబం నుంచి మొదలవుతాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. త్యాగాలకు సిద్ధమవడం అంటే సోనియా కుటుంబం నుంచే ఇది మొదలవుతుందా అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.. కుటుంబంలో ఒకరికే టికెట్ అనే విధానం అన్ని చోట్లా సాధ్యమవుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.. మరోవైపు కాంగ్రెస్‌కు నాయకత్వం ఎవరు వహిస్తున్నారన్నది కూడా తేలాల్సి ఉంది. ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లోనూ రాహుల్ నాయకత్వాన్ని ఓ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది..
Also Read : విద్యార్థి నాయకుల పరామర్శకు రాహుల్ గాంధి