ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు ఇప్పటికే అందరికీ అందుతున్నాయని వెల్లడించారు.
విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశామని, స్లమ్ ఫ్రీ సిటీగా విశాఖను మార్చడమే సిఎం జగన్ లక్ష్యమని వివరించారు. పట్టణాల్లో 15 శాతం కంటే తక్కువగానే పన్నులు పెరుగుతాయని, ఆస్తి పన్నుపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. గ్రేటర్ విశాఖపట్నం మునిక్క్షిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) పరిపాలనా భవనంలో నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు, ఇన్ ఛార్జ్ మంత్రి కన్నబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయసాయిరెడ్డి తో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నామని, విశాఖ నుంచి భోగాపురం వరకు 6లైన్ల రోడ్లు, 9 బీచ్ లు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. ఒక సెంటు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణ జరగకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
2022 మార్చి నాటికి 3 వేల కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పార్కులు, ఓపెన్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కన్నబాబు చెప్పారు. డిసెంబర్ నాటికి అమృత పథకం కింద తాగునీరు అందిస్తామని, నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దుతామని వివరించారు.